‘జియో ఫోన్ నెక్స్ట్’ ఫీచర్లు ఇవే

Published: Thursday June 24, 2021

సంచలనాలకు మారుపేరు అయిన రిలయన్స్ జియో టెలికం రంగంలో మరో సంచలనానికి తెరతీసింది. ఈ ఏడాది గణేశ్ చవితిని పురస్కరించుకుని నయా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ ‘జియో నెక్స్ట్’ స్మార్ట్‌ఫోన్ అత్యంత చవకగా అందుబాటులోకి రానున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు.

జియో పోన్, జియోఫోన్ 2 తర్వాత రిలయన్స్ నుంచి వస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇదే. మొదటి ఫీచర్ ఫోన్ కాగా, రెండోదాంట్లో కొన్ని స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు రాబోతున్నది పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంటుంది. తొలిసారి స్మార్ట్‌ఫోన్‌కు మారే యూజర్లను ఉద్దేశించి రూపొందించిన ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ వెర్షన్‌ను అభివృద్ధి చేసినట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 

ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్, వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, అగుమెంట్ రియాలిటీతో కూడిన స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర వెల్లడి కాకున్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.  షియోమీ, శాంసంగ్, రియల్‌మి వంటి వాటి వాటికి ఇది నేరుగా గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.