ఆధార్, పాన్‌కార్డులతోనే రైలు టికెట్ల బుకింగ్..

Published: Saturday June 26, 2021

టికెట్ బుకింగ్స్‌లో అక్రమాలకు అరికట్ట వేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు అక్రమార్కులు పెద్ద సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకుని వాటిని రెట్టింపు ధరలకు ప్రయాణికులకు అమ్ముతున్నారు. తద్వారా మోసాలకు తెరతీస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఎవరైనా వ్యక్తి ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేయాలంటే.. ఇకపై ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఆధార్ కార్డు వివరాలనో, పాన్ కార్డు వివరాలోనో నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ కార్డుకు  లింక్ అయి ఉన్న ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాతే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో నిపుణులు ఉన్నారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ వెల్లడించారు. 

 

‘భవిష్యత్తులో ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాల వివరాలు ఇవ్వకుండా రైల్వే టికెట్లను కొనుగోలు చేయలేరు. ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాతే టికెట్లను బుక్ చేయగలరు. దీని వల్ల రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టొచ్చు. మా భవిష్యత్ ప్లాన్ ఇది. ఇది దాదాపుగా పూర్తయింది. ఆధార్ కార్డుతో లాగిన్ అయ్యేందుకు సంబంధించి పని పూర్తయింది. మిగిలిన కార్డులతో కూడా ప్రయాణికుడు వెబ్‌సైట్‌లో లాగిన్ అవగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇది కూడా పూర్తవుతుంది’ అని అరుణ్ కుమార్ చెబుతున్నారు. 2019వ సంవత్సరం నవంబర్ నెలలోనే దీనికి సంబంధించిన పనిని మొదలు పెట్టామని ఆయన వెల్లడించారు. 2021వ సంవత్సరం మే నెల వరకు టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న 14,257 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. 28.34 కోట్ల రూపాయల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.