నిరుద్యోగ గర్జన

మంత్రుల నివాసాలు, కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు.. రోడ్లపై ర్యాలీలతో విద్యార్థులు, నిరుద్యోగులు హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. విద్యార్థి నాయకుల అరె్‌స్టలు, గృహనిర్బంధాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అరకొర ఖాళీలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై యువత ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ చేర్చి కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ, బీజేవైఎం, ఏఐవైఎఫ్, ఏఐఎ్‌సఎఫ్, తెలుగు యువత, పీడీఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ డీవైఎ్‌ఫఐ సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో నామ మాత్రంగా ఖాళీ పోస్టులను చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఖాళీగా ఉన్న రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యాలయాల వద్ద ఆందోళన
విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం ఆధ్వర్యంలో నేతలు యత్నించారు. విద్యార్థి సంఘాల పిలుపుతో ‘జాబ్ క్యాలెండర్’కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థి నేతలు ప్రయత్నించగా వారిని సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొందరు విద్యార్థి నేతలను గృహనిర్బంధం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘాలు, రాజకీయ పార్టీల అనుబంధ సంస్థల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశానికి వస్తున్న మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తుగా పలువురు విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేశారు.
బెజవాడలో మహాధర్నా
జాబ్ క్యాలెండర్‌ను రద్దుచేసి, ఖాళీలన్నీ చేర్చి కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా నిర్వహించారు. నగరంలోని ధర్నాచౌక్‌లో జరిగిన మహాధర్నాలో ఏఐవైఎఫ్, ఏఐఎ్‌సఎఫ్, తెలుగు యువత, పీడీ ఎ్‌సయూ, ఎస్‌ఎ్‌ఫఐ డీవైఎ్‌ఫఐ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో పోస్టుల సంఖ్య పెంచుతూ కొత్త జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగుల ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను అవమానించేలా ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం పోస్టులు పెంచే వరకు పోరాడుతామన్నారు. నిరుద్య్గోగులను ప్రభుత్వం ఆదుకోవాలని, వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై కేసులు పెడతారా? అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ విమర్శించారు. జీవో 59 ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు.
‘జాబ్ క్యాలెండర్’పై యువతలో ఆగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసింది. ‘ఉద్యోగ విప్లవం’ అంటూ ప్రభుత్వం చేసిన వంచనపై నిరసన ధ్వనులు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలతో కదంతొక్కారు. మంత్రుల ఇళ్లు, కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. యువజన సంఘాలు, పార్టీల అనుబంధ సంఘాలు, నిరుద్యోగ జేఏసీ పిలుపుతో రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ చేర్చి కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు.

Share this on your social network: