భాషను కాపాడుకుంటేనే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోగలo

భాషను కాపాడుకుంటేనే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోగలమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. భాషా పరిరక్షణ కోసం ఐదు సూత్రాలను సైతం ఆయన సూచించారు. శ్రీ సాంస్కృతిక కళాసారధి – సింగపూర్ సంస్థ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమంలో అంతర్జాలం ద్వారా ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతిని ఖండాంతరాలకు మోసుకువెళ్ళి అక్కడ మన అచారాలు కట్టుబాట్లు పాటిస్తూ, సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్న ప్రవాస భారతీయుల్ని సాంస్కృతిక వారధులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారంతా ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చేశారని, వారి పాత్రను చూసి మాతృభూమి గర్విస్తోందని తెలిపారు. ఈ సాంస్కృతిక భావన మానవాళి పురోగతికి దోహదం చేస్తుందని ఆకాంక్షించారు.
ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్వేగ అంశాలు ఆ సమాజపు సంస్కృతి అవుతుందన్న యునెస్కో నిర్వచనాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, కళలు, జీవన విధానాలు, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు సైతం ఈ సంస్కృతిలో భాగాలే అని తెలిపారు. అనేక ప్రత్యేకతల కారణంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మంగా పరిఢవిల్లిందన్న ఆయన, పశువులు, చెట్లు, నదులను పూజించే భారతీయు సంప్రదాయం ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. పేదలకు సాయం చేయడానికి భారతీయులు ధర్మంగా భావించారన్న ఉపరాష్ట్రపతి, మన జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళు అందరూ కలిసి మెలసి జీవించడానికి సాయపడ్డాయని, ఇవన్నీ మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కడతాయని పేర్కొన్నారు.
భారతదేశం అనేక భాషలు, సంస్కృతుల నిలయమన్న ఉపరాష్ట్రపతి, భిన్నత్వంలో ఏకత్వం మనందరినీ కలిపి ఉంచిందని, మనిషి మారినా సంస్కృతిని మరచిపోలేదని, మనిషి ఆదర్శవంతంగా జీవించడానికి సంస్కృతి దోహదం చేస్తుందని తెలిపారు. ఖండంతరాలు దాటినా నేటికీ మన సంస్కృతిని కాపాడుకుంటున్న ప్రవాస భారతీయులకు అభినందనలు తెలిపారు.
భాష, సంస్కృతులకు అవినాభావ సంబంధం ఉందన్న ఉపరాష్ట్రపతి, భాష మన సంస్కృతికి జీవనాడి అని, ఉన్నతమైన సంస్కృతి, ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని తెలిపారు. భాషా వైవిధ్యం నాగరికతకు గొప్ప పునాది అన్న ఆయన భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని తెలిపారు. ప్రతి నాగరికతా తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేసిందన్న ఆయన, మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపార సంబంధాలు భాష లేకుండా పెంపొందలేవని పేర్కొన్నారు.

Share this on your social network: