రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

రాష్ట్రంలో ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా కానుక ప్రారంభించడంతో పాటు నూతన విద్యావిధానంపై అదే రోజు సమగ్రంగా వివరించనుంది. విద్యాశాఖలో ‘నాడు-నేడు’, అంగన్‌వాడీలపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆగస్టు 16నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడత ‘నాడు-నేడు‘ పనులను అదేరోజు ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అనంతరం రెండో విడత పనులకు కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ‘‘పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండకూడదు. ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ లేదు. పారదర్శకంగా పనులు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు’’ అని జగన్ స్పష్టం చేశారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు, మెరుగులు దిద్దే ప్రక్రియను పూర్తిచేసి ఆగస్టు 16న విధివిధానాలు వెల్లడించాలని ఆదేశించారు. కొత్త విద్యావిధానంలో పీపీ-1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూళ్లు వస్తాయన్నారు. శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు(పీపీ-1, పీపీ-2), ఫౌండేషన్ స్కూళ్లు(పీపీ-1, పీపీ-2, 1, 2 తరగతులు), ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు (పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5 తరగతులు), ప్రీ హైస్కూళ్లు(పీపీ-1, పీపీ-2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు), హైస్కూళ్లు(3 నుంచి 10వ తరగతి వరకూ), హైస్కూల్ ప్లస్(3నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని సీఎం వివరించారు.
‘‘శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది. 3కి.మీ. పరిధిలో హైస్కూల్ ఉంటుంది. ఆ పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నాం’’ అని జగన్ పేర్కొన్నారు. ‘‘ఉపాధ్యాయులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడమే నూతన విద్యావిధానపు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 5వ తరగతి వరకూ ప్రతి టీచర్ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. కొన్నిచోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరి కొన్నిచోట్ల నలుగురికి ఒకే టీచర్ బోధిస్తున్న పరిస్థితి ఉంది. నూతన విధ్యావిధానంలో ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. 5వ తరగతి వరకు 18సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన టీచర్లతో బోధన అందించబోతున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారు’’ అని సీఎం చెప్పారు.

Share this on your social network: