చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. భారత్‌కు తొలి స్వర్ణం

Published: Saturday August 07, 2021

జపాన్‌ రాజధానిలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 23 ఏళ్ల భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో తొలిసారే 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ మూడో రౌండ్ వరకు అదే జోరు కొనసాగించి తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. నాలుగైదు రౌండ్లలో చతికల పడినప్పటికీ ప్రత్యర్థులు ఎవరూ అతడి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.

 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన నీరజ్ 121 ఏళ్ల భారత చరిత్రలో అథ్లెటిక్స్‌లో బంగారం అందించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. అంతకుముందు 2008 ఒలింపిక్స్‌‌లో అభినవ్ బింద్రా 19 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దేశానికి తొలి స్వర్ణ పతకం అందించాడు.  

 

నీరజ్ పతకంతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. 1900 సంవత్సరంలో నోర్మన్ ప్రిచర్డ్ ట్రాక్‌లో రెండు రజత పతకాలు గెలుచుకున్నాడు. అయితే, అది బ్రిటిష్ ఇండియా కాలం నాటి మాట. స్వతంత్ర భారతావనిలో మాత్రం ఇదే తొలిసారి. దిగ్గజ అథ్లెట్ అయిన మిల్కా సింగ్, పీటీ ఉష 1960, 1984లో దగ్గరగా వచ్చినప్పటికీ నాలుగో స్థానంతో నిలిచి నిరాశ పరిచారు.