సంచలన ప్రకటన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Published: Sunday August 15, 2021

యువతకు ఉపాధి, స్థానిక కంపెనీలకు చేయూత లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ పథకాన్ని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి మాట్లాడుతూ, రూ.1 కోటి కోట్లతో ‘గతిశక్తి’ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో భవిష్యత్తులో కొత్తగా ఆర్థిక మండళ్ళ ఏర్పాటుకు అవకాశం లభిస్తుందన్నారు. నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను కూడా ప్రకటించారు. 90 నిమిషాలపాటు మాట్లాడిన మోదీ అనేక అంశాలను ప్రస్తావించారు. 

 

రూ.1 కోటి కోట్లతో ప్రధాన మంత్రి గతి శక్తి నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్‌ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక మాన్యుఫ్యాక్చరర్లు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు, సమగ్ర మౌలిక సదుపాయాల వృద్ధికి  ఈ పథకం దోహదపడుతుందన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సమగ్ర మార్గాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారుచేయడానికి మనమంతా కలిసి పని చేయాలన్నారు. కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్, న్యూ ఏజ్ టెక్నాలజీలను ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. 

 

దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను కూడా ప్రకటించారు. దీంతో గ్రీన్ హైడ్రోజన్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేసే దేశంగా భారత్ మారుతుందన్నారు. గ్రామాలు వేగంగా మారుతుండటాన్ని మనం గమనిస్తున్నామన్నారు. 

 

పేదలు, రైతులు, దేశ విభజన కష్టాల గురించి మోదీ మాట్లాడారు. ఉగ్రవాదం, విస్తరణవాదం విసురుతున్న సవాళ్ళను వివరించారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ప్రపంచానికి ‘నవ భారతం’ సందేశాన్ని పంపించిందన్నారు. భారత దేశం మారుతోందని, సంక్లిష్టమైన నిర్ణయాలను తీసుకోగలదని నిరూపితమవుతోందన్నారు. 

 

75 వారాలపాటు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 వందే భారత్ రైళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులు త్వరలోనై రైల్వే సేవలతో అనుసంధానమవుతాయన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియాతో ఈ ప్రాంతానికి అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు.