తెలంగాణలోని గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్

తెలంగాణలోని గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దాల్ నోటీసులు జారీ చేశారు.
కాగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో ఈ నెల 4న ఆయన్ను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి సహాయకులుగా అతడి భార్య, మరదలు ఆస్పత్రిలో ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె, ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్ వద్దకు వెళ్లలేదు. పేషెంట్ కుమారుడు ఈ నెల 9వ తేదీన.. తన తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి, పిన్ని 7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని అతడికి తెలిసింది. వారి కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో.. 11వ తేదీన అతడు తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఆదివారంనాడు ఉమామహేశ్వర్ అతడికి ఫోన్ చేసి.. ‘‘ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో దుస్తులు లేని స్థితిలో మీ పిన్ని ఉంది’’ అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ తుప్పల్లో అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందని అతడు వివరించాడు. కాగా.. ఇప్పటికీ రెండవ బాధితురాలి ఆచూకీ లభ్యం కాకపోవడం గమనార్హం.

Share this on your social network: