గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు వ్యాఖ్యలు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సింది సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలివ్వాలని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదేనని, కానీ.. దానికి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని సూచించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లలోనే మట్టి గణపతిని పూజించి నిరాడంబరంగా నిర్వహించుకోవాలంటూ ప్రజలకు సూచిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించగా.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హుస్సేన్‌సాగర్‌లో గణపతి, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని నిషేదించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం బుధవారం మరోమారు విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక సమర్పించాలంటూ ఇప్పటికి రెండు సార్లు ఆదేశించినా ప్రభుత్వం సమర్పించకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భారీగా జనం గుమికూడకుండా, ఇప్పటికే కలుషితమైన హుస్సేన్‌సాగర్‌లో రసాయనిక రంగులతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో సెప్టెంబరు 1 లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల నుంచి ఉన్నతాధికారులు హాజరు కావాలని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

Share this on your social network: