ప్రభుత్వ ప్రయోజనాలు లేవు.. ఇచ్చేది స్టైఫండ్‌

Published: Saturday August 21, 2021

రైస్‌ కార్డులు కలిగిన ప్రభుత్వోద్యోగులు తక్షణమే వాటిని సరెండర్‌ చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయటం సంచలనంగా మారింది. జిల్లాలో మొత్తం 12 వేల మంది కార్డులు సరెండర్‌ చేయాలని ఆదేశించగా, వారిలో దాదాపు ఎనిమిది వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ప్రభుత్వోద్యోగుల రేషన్‌ కార్డుల రద్దుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు, సివిల్‌ సప్లయిస్‌ అధికారుల మెడ మీద కత్తి పెట్టడంతో ఆగమేఘాల మీద రైస్‌ కార్డుల ర ద్దుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వోద్యోగులు రైస్‌ కార్డులను వెనక్కిచ్చేయటం చట్టబద్ధమే అయినప్పటికీ, వీరిలో అల్పాదాయ వర్గాల వారికి గత ప్రభుత్వం న్యాయం చేసింది. అప్పట్లో ఆర్టీసీ, విద్యుత్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో తక్కువ వేతనాలు పొందే వారికి మినహాయింపునిచ్చింది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ఆదాయంతో సంబంధం లేకుండా అందరి కార్డులనూ ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 12 వేల మంది ప్రభుత్వోద్యోగులు రైస్‌ కార్డులను కలిగి ఉన్నారని అధికార యంత్రాంగం గుర్తించింది. ఒక్క విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే 4,470 రైస్‌ కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని లెక్క తేల్చారు. గుడివాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2,029, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 2,767, నూజివీడు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో  2,734 రైస్‌ కార్డులు ఉన్నాయని గుర్తించారు. ఇలా గుర్తించిన వాటిలో ఎనిమిది వేల కార్డులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులవే.

జిల్లాలో 845 గ్రామ సచివాలయాలు, 440 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎనిమిది వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సచివాలయాల ఉద్యోగులు కాక ముందు నుంచే కార్డులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నా, వీరికి ఎలాంటి సర్వీసు రూల్స్‌ లేవు. ప్రొబేషనరీలోనే ఉన్నారు. స్టైఫండ్‌ మాత్రమే తీసుకుంటున్నారు. ఒక రకంగా వీరంతా ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో  కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి  స్టైఫండ్‌గా రూ.15 వేలు ఇస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందే ఏ ఒక్క ప్రయోజనమూ వీరికి అందదు. ప్రభుత్వం వీటన్నింటినీ విస్మరించటమే విడ్డూరంగా ఉంది.

ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రైస్‌ కార్డుల నిబంధనల ప్రకారం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించి ఆదాయం ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే రైస్‌ కార్డుకు అనర్హులవుతారు. ఈ లెక్కన సచివాలయ ఉద్యోగులకు రూ.15 వేలు వేతనం వస్తుందన్న కారణంతో నిబంధనల ప్రకారం రైస్‌ కార్డుకు అర్హత లేదన్నది ప్రభుత్వ వాదన. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా రైస్‌ కార్డులను కలిగి ఉన్నందున  వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించటమే వారిని ఆందోళనకు గురి చేస్తోంది.