పుతిన్‌తో మోదీ సంభాషణ

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో వివరంగా మాట్లాడానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా మంగళవారం సవివరంగా చర్చించినట్లు తెలిపారు. తమ మధ్య ప్రయోజనకరమైన సంభాషణ జరిగిందని, పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామని ఓ ట్వీట్‌లో తెలిపారు.
ప్రధాని మోదీ మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవలి పరిణామాలపై నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో వివరంగా చర్చించాను. పరస్పరం ప్రయోజనకరమైన రీతిలో అభిప్రాయాలను పంచుకున్నాం. కోవిడ్-19 మహమ్మారి విషయంలో భారత్-రష్యా మధ్య సహకారంతో పాటు ద్వైపాక్షిక ఎజెండాపై చర్చించాం. ముఖ్యమైన విషయాలపై సంప్రదింపులను కొనసాగించేందుకు అంగీకరించాం’’ అని తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి దౌత్య మిషన్‌ను భారత దేశం ఖాళీ చేసింది. తాలిబన్ల వ్యవహార శైలి, ఇతర ప్రజాస్వామిక దేశాల స్పందన ఆధారంగా ఆ ప్రభుత్వంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ చెప్తోంది.
రష్యా తన దౌత్యవేత్తలను కాబూల్‌లో కొనసాగిస్తోంది. తాలిబన్లతో సంప్రదింపులకు అన్ని మార్గాలను తెరచి ఉంచింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆచితూచి స్పందిస్తోంది. అతి సంప్రదాయవాద పాలకులపై ఓ నిర్ణయం తీసుకోవడానికి తాము ఆత్రుతపడటం లేదని తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయిన ప్రజలను రష్యా, తదితర దేశాలకు పంపించాలనే పాశ్చాత్య దేశాల ఆలోచనను రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శరణార్థుల ముసుగులో ఉగ్రవాదులు రావడాన్ని తాను కోరుకోవడం లేదన్నారు.

Share this on your social network: