సీబీఐ కోర్టుకు విన్నవించిన విజయసాయిరెడ్డి

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులకు సంబంధించి తనపై సీబీఐ నమోదు చేసిన కేసుల కంటే ఈడీ నమోదు చేసిన కేసులను ముందుగా విచారించడం తగదని హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ కేసులనే ముందుగా విచారించాలన్న అంశంపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని న్యాయస్థానానికి నివేదించారు. ఈమేరకు బుధవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా విజయసాయిరెడ్డి తరఫున లాయర్ వాదనలు వినిపించారు. సీబీఐ కేసుల కంటే ముందు ఈడీ కేసులు విచారణ జరపడంపై తమ క్లయింట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో తన క్లయింట్ పిటిషన్ దాఖలు చేేస వరకు ఈడీ కేసులను వాయిదా వేయాలని అభ్యర్థించారు. విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కూడా సమర్థించిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో కేసులపై తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, పెన్నా సిమెంట్స్ కేసుపై కూడా సీబీఐ న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలని సీఎం జగన్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ మరింత సమయం కావాలని కోరింది. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డి, రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. పెన్నా చార్జ్‌షీట్‌లో సీబీఐ తన పేరు చేర్చడంపై సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని సీబీఐ కోరడంతో న్యాయస్థానం విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది.

Share this on your social network: