ఎవరైనా తోక జాడిస్తే...హెచ్చరించిన తాలిబన్లు

Published: Monday September 06, 2021

ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ను చేజిక్కించుకున్నామని తాజాగా ప్రకటించిన తాలిబన్లు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే పంజ్‌షీర్‌కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. నేడు కాబూల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. యుద్ధం ముగిసిందని, ఇక ఆఫ్ఘనిస్థాన్ సుస్థిరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఎవరైనా ఆయుధాల వైపు చూసినా, వాటిని ముట్టినా వారు à°ˆ దేశానికి, ప్రజలకు శత్రువులుగా మారతారని హెచ్చరించారు. ‘చొరబాటుదారులు’ ఎప్పుడూ మన దేశ పునర్నిర్మాణం చేయలేరన్న విషయాన్ని ప్రజలు గుర్తెరగాలని, ఇది ప్రజల బాధ్యత అని జబీహుల్లా పేర్కొన్నారు.  

 

సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాలిబన్లు ప్రయత్నించారని పేర్కొన్న ఆయన.. తాము చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తే ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తలతిక్క సమాధానాలు ఇచ్చిందని అన్నారు. దేశం నుంచి పరారైన వారు ఇంకా తాలిబన్లతో యుద్ధం చేస్తున్నామనే అనుకుంటున్నారని, తామైతే ఎప్పటికీ శాంతినే కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

 

ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే పంజ్‌షీర్‌లో ఏం జరిగిందో చూశారుగా అని జబీహుల్లా హెచ్చరించారు. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు తాము పౌరులెవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదని స్పష్టం చేశారు. 

 

కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఖతర్, టర్కీ, యూఏఈ కంపెనీ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్టు చెప్పారు. కాగా, తిరుగుబాటు దళాలతో ఉన్న ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలే గురించి తాలిబన్లు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

 

తాలిబన్లతో యుద్ధానికి దిగిన వారిని క్షమించేసినట్టు చెప్పారు. ఆఫ్ఘన్ దళాల్లో à°—à°¤ 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తాలిబన్ దళాల్లో చేరాల్సిందిగా కోరుతామని పేర్కొన్న జబీహుల్లా పంజ్‌షీర్‌లో త్వరలోనే విద్యుత్, ఇంటర్నెట్‌ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.