కొవిడ్ సోకితే.. వీరికి డేంజర్

వయసు పైబడిన వారిపై బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మరీ ముఖ్యంగా ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయినా కొవిడ్ సోకితే మరింత ప్రమాదంగా పరిణించే ప్రమాదం ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం హెచ్చరించింది. రెండూ టీకా డోసులు వేయించుకున్న తర్వాత కూడా కరోనా సోకితే దానిని ‘బ్రేక్ త్రూ’ ఇన్ఫెక్షన్‌గా వ్యవహరిస్తారు.
తీవ్రమైన బ్రేక్ త్రూ క్రేసులకు సంబంధించి ఆగస్టు 30 నాటికి సీడీసీ 12,908 నివేదికలు అందుకుంది. ఇందులో ఆసుపత్రి పాలైనవారు, చనిపోయిన వారి కేసులు కూడా ఉన్నాయి. సీడీసీకి అందిన నివేదికల ప్రకారం.. ఆసుపత్రిలో చేరడానికి కారణమైన దాదాపు 70 శాతం కేసులు 65 ఏళ్లు పైబడిన పెద్దవారిలో ఉన్నాయి. అంతేకాక, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారిలో 65 ఏళ్లు అంతకంటే పైబడిన వారు ఉండడం గమనార్హం.
జనవరి 24-జులై 24 మధ్య సీడీసీ ఈ అధ్యయనం నిర్వహించింది. వయసు పైబడిన వారికి సంబంధించి మొత్తంగా 4,700 హాస్పిటలైజేషన్లను కొవిడ్-నెట్ ద్వారా విశ్లేషించింది. అయితే, ఈ అధ్యయనాన్ని పీర్-రివ్యూ చేయాల్సి ఉంది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్‌కు గురై ఆసుపత్రులలో చేరతున్న వారిలో మధ్యస్తంగా 73 ఏళ్లు వారు ఉన్నారు. వీరిలో దాదాపు 71 శాతం మందిలో మధుమేహం, గుండె జబ్బులు, ఆటోఇమ్యూనో కండిషన్స్ వంటివి ఉన్నట్టు గుర్తించారు.
టీకాలు తీసుకోకుండా కొవిడ్ బారినపడి ఆసుపత్రులలో చేరుతున్న వారి మధ్యస్త వయసు 59 ఏళ్లు. వీరిలోనూ 56 శాతం మంది మూడు అంతకంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అధ్యయనం వివరించింది.

Share this on your social network: