నియామకం ఒకటి.. ఉద్యోగం మరొకటా?

పోలీస్... అంటేనే ఒక ప్రత్యేకమైన కొలువు. దేహ దారుఢ్య పరీక్షలు చేయాలి. మానసిక స్థితిని అంచనా వేయాలి. ప్రజా భద్రత పట్ల వారి వైఖరేమిటో పరీక్షించాలి. కానీ... ఇవేమీ లేకుండానే 15 వేల మందిని పోలీసులను చేసేస్తున్నారు. వారి ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండానే ఖాకీ దుస్తులు వేసుకోవాల్సిందే అంటున్నారు. దివ్యాంగులను సైతం పోలీసులను చేసేస్తున్నారు. ఇదీ... గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన వారి పరిస్థితి. ఇతర శాఖలు నియమించిన ఉద్యోగులను ఎలాంటి శిక్షణ లేకుండానే పోలీసులుగా మార్చేయడమనే చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఇది సరి కాదని... తమకు ఆప్షన్ ఇచ్చి, నచ్చిన వారినే మహిళా పోలీసులుగా ఎంపిక చేయాలని, మిగిలిన వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోనే కొనసాగించాలని వీరు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామీణులకు 500 రకాల సేవలందించాలన్న లక్ష్యంతో నియామకాలు చేపట్టింది. 14 శాఖల ద్వారా ఉద్యోగులను నియమించింది. మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా అందించే సేవల కోసం మహిళా కార్యదర్శులను నియమిస్తే బాగుంటుందని భావించింది. ఇందుకోసం 14రకాల కార్యదర్శుల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టును సృష్టించింది. ఈ పోస్టులను మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా భర్తీ చేశారు. మహిళలకు అందించే సేవలతో పాటు మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఎదుర్కొనేందుకు ఈ కార్యదర్శులను వినియోగించుకోవాలని నిర్ణయించారు. మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పోలీసు శాఖ సహకారం కూడా తీసుకోవాలని భావించారు.
అయితే ‘పోలీసు సహకారం’ అన్న భావన తీసుకురావడంతో మొత్తం పరిణామాలు మారిపోయాయి. మొదట మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించిన ప్రభుత్వం.. ఆ తర్వాత జాబ్‌చార్ట్ నిర్ధారించే సమయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు/మహిళా పోలీసులుగా పేర్కొంది. ఇప్పుడు ఏకంగా డీజీపీ.. మహిళా పోలీసులను ఇతర అవసరాలకు వినియోగిస్తారా? అంటూ సీఎ్‌సకు రాశారు.
మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన వారిందరిని ఇప్పుడు పోలీసులుగా మార్చామంటూ పోలీసు శాఖ ముందుకెళ్తోంది. వారికి ప్రొబేషనరీ ప్రకటించాలంటే పోలీసు శాఖ నిర్వహించే పరీక్షలు పాస్ కావాలంటూ నిబంధనలు పెట్టారు. పైగా 25మార్కులు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేస్తారంటూ, వారి ఉద్యోగభవిష్యత్తు ఎస్‌ఐ చేతిలో పెట్టారు. వీరందరూ పోలీసు శాఖకు సంబంధించిన ఉద్యోగులంటూ సర్వీస్ రూల్స్‌ను అందుకనుగుణంగా మార్చేశారు. పోలీసు శాఖలోనే ఆయా ఎస్‌హెచ్‌ఓ పరిధిలో పనిచేయాలని, యూనిఫాం తప్పనిసరిగా వేసుకోవాలని లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చారు. అయితే వారిని నియమించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మాత్రం కిమ్మనకుండా చోద్యం చూస్తోంది.

Share this on your social network: