ఇతర దేశాలు జోక్యం కూడదు..తాలిబన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ టురబి హెచ్చరిక

ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆఫ్ఘనిస్థాన్ నూతన పాలకులు స్పష్టం చేశారు. ఉరితీతలు, చేతులు నరకడాలు వంటి శిక్షలను పునరుద్ధరిస్తామని తెలిపారు. అయితే ఇటువంటి శిక్షలను బహిరంగంగా అమలుపరచాలా? వద్దా? అనే అంశంపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. తమ పాలనలో ఇతర దేశాలు జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. తాలిబన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ టురబి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు.
తాలిబన్లు 1996-2001 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌ను పరిపాలించినపుడు కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో లేదా ఈద్గా మసీదు మైదానంలో శిక్షలను అమలు చేసేవారు. వందలాది మంది చూస్తుండగా శిక్షలు అమలయ్యేవి. బాధితుల కుటుంబ సభ్యులు దోషి తలలోకి కాల్చి చంపడం వంటి పద్ధతులను అనుసరించేవారు. ఒక్కొక్కసారి బాధితుల కుటుంబ సభ్యులు ‘‘బ్లడ్ మనీ’’ తీసుకుని, దోషిని సజీవంగా వదిలిపెట్టే అవకాశం ఉండేది. దొంగలకు చేతులను నరికేవారు. హైవేలపై దోపిడీకి పాల్పడినవారి చేతిని, కాలిని నరికేవారు. అయితే విచారణలు, దోషిత్వ నిర్థరణలు బహిరంగంగా జరగడం అరుదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామిక్ మత పెద్దలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మత పెద్దలకు న్యాయశాస్త్రంలో నైపుణ్యం ఉండదు.

Share this on your social network: