సీఎం అయినా.. మంత్రి అయినా సరే.. అందరికీ ఒకే రూల్

Published: Saturday October 02, 2021

రూల్స్ అందరికీ వర్తిస్తాయ్.. సామాన్యుడు అయినా.. సీఎం అయినా.. మంత్రి అయినా సరే.. అందరికీ ఒకే రూల్.. అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేతల్లో చేసి చూపించారు.! భాగ్యనగరం నడిబొడ్డున ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వాహనాన్నే ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. దీంతో ఖాకీల పని తీరును సోషల్ మీడియా వేదికగా కొందరు మెచ్చుకుంటుంటే.. వామ్మో.. మంత్రి కారునే ఆపేశారబ్బా.. అని కొందరు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది..? ఈ వ్యవహారం ఎందుకింత చర్చనీయాంశమైంది..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

ఇవాళ గాంధీ జయంతి.. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా జయంతి రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే.. అవేమీ లెక్కచేయకుండా కొందరు రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు వారిపై కొరడా ఝులింపించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌కు వెళ్లి తిరిగొస్తుండగా మంత్రి కేటీఆర్ కారును స్థానిక ట్రాఫిక్ పోలీస్ అధికారి ఐలయ్య ఆపేశారు. ‘రాంగ్ రూట్‌లో వస్తున్నారు.. ఇక్కడ మీకు అనుమతి లేదంటూ’ కారును ఆపేశారు. అయితే.. అదే రూట్‌లో వెళ్తున్న డీసీపీ కారుకు పోలీసులు అనుమతివ్వడం గమనార్హం. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఆర్ఎస్ కార్యకర్తలు.. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసు అధికారులను టీఆర్ఎస్ కార్యకర్తలు పక్కకు నెట్టేయబోయారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే కేటీఆర్ కాన్వాయ్‌లోని ఓ కారును ఆపేశారా..? లేకుంటే ఆపిన కారులోనే మంత్రి ఉన్నారా..? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

కాగా.. బాపూజీ ఘాట్‌లో నివాళులు అర్పించేందుకు గవర్నర్ బండారు దత్తాతేయ కూడా వచ్చారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ కాన్వాయ్ బయటికెళ్తుండగా.. ఆ రూట్‌లో వెళ్లకుండా కేటీఆర్ కాన్వాయ్.. రాంగ్‌ రూట్ తీసుకుంది. దీంతో కేటీఆర్ కారును ట్రాఫిక్ పోలీసు అధికారి అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. కొందరు ట్రాఫిక్ పోలీసుల పని తీరును మెచ్చుకుంటుంటే.. మరికొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో కానీ.. మీడియాలో కానీ ఎక్కడా స్పందించలేదు.