నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైంది

ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైంది. గతేడాది వైద్య రంగంలో శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించగా, ఈసారి ఇద్దరిని వరించింది. టెంపరేచర్, టచ్ కోసం రెసెప్టార్స్ (ఉష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలు) కనుగొన్నందుకు గాను డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రకటించారు.
వీరిద్దరూ అమెరికా జాతీయులే కావడం గమనార్హం. వేడి, చల్లదనం, స్పర్శకు సంబంధించిన జ్ఞానం మెదడుకు చేరే క్రమంలో నరాలు ఎలా ప్రేరేపించబడతాయి? వాటి స్పందనలు ఎలా ప్రారంభం అవుతాయి? అనే అంశంలో పరిశోధన చేసిన వీరిద్దరూ ఈ గ్రాహకాలను కనుగొన్నారు.
స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని ప్యానెల్ ఈ ప్రకటన చేసింది. మెడిసిన్‌లో గతేడాది ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ అందుకున్నారు. కాలేయాన్ని నాశనం చేసే హెపటైటిస్ సి వైరస్‌ను కనుగొన్నందుకు గాను వారికి ఈ ప్రతిష్టాత్మక బహుమతి లభించింది. ప్రాణాంతక హెపటైటిస్ సి వైరస్ బ్లడ్ బ్యాంకుల ద్వారా విస్తరించకుండా ఉండేందుకు ఈ పరిశోధన తోడ్పడింది.
ఫిజియాలజీ లేదంటే మెడిసిన్‌లో నోబెల్ బహుమతి అందించడానికి సంబంధించి ఆల్‌ఫ్రెడ్ నోబెల్ కచ్చితమైన విధివిధానాలు రూపొందించారు. వైద్య రంగంలో కనుగొనేది ఏదైనా అది మానవాళికి ఉపయోగపడాలని నోబెల్ పేర్కొన్నారు. నోబెల్ కమిటీ దానిని తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తోంది.
అవార్డులో భాగంగా పసిడి పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రానర్ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) అందిస్తారు. అలాగే, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో నోబెల్ ప్రైజ్‌ను బహూకరిస్తారు. మరో వారం రోజుల్లోనే ఈ అవార్డులు ప్రకటించునున్నారు.

Share this on your social network: