దుర్గాపూజా మండపాలపై దాడులు.. ముగ్గురి మృతి
బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దుర్గాపూజా మండపాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. కుమిల్లలోని దుర్గాపూజా మండపంలో ఖురాన్‌ను అపవిత్రం చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. దీంతో రెచ్చిపోయిన కొందరు దుర్గా మండపాలను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయారు. వారిని పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది.
కుమిల్ల విధ్వంసం, హింస తర్వాత చాంద్‌పూర్‌లోని హాజిగంజ్, చత్తోగ్రామ్‌లోని బన్ష్‌కాళి కోక్స్‌బజార్‌లోని పెకువాలకూ పాకింది. హింస చెలరేగిన ప్రాంతాల్లో ప్రభుత్వం పారామిలిటరీ బలగాలను మోహరించింది. దేవి మండపాలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలను బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇదో అపకీర్తి మూటగట్టుకున్న ఘటన ఇదని, గత 24 గంటల్లో ఏం జరిగిందనేది ఒక్క ట్వీట్‌లో చెప్పలేమని కౌన్సిల్ ట్వీట్ చేసింది.
ప్రజల నిజస్వరూపాన్ని బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇప్పుడు చూస్తున్నారని పేర్కొంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేమని, కానీ బంగ్లాదేశ్‌లోని హిందువులు 2021 దుర్గాపూజను ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొంది. ఢాకాలోని టిప్పు సుల్తాన్ రోడ్డు, కొత్వాలి, చిట్టగాంగ్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

Share this on your social network: