రూ.110 దాటిన పెట్రోల్

ఇంధన ధరలు మరింత భగ్గుమన్నాయి. ఆదివారం లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు మరో 35 పైసల చొప్పున పెరిగాయి. చమురు కంపెనీలు వరుసగా నాలుగో రోజూ రేట్లు పెంచడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డు గరిష్ఠ స్థాయికి దూసుకుపోయాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.105.84కు, ముంబైలో రూ.111.77కు చేరింది. ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.102.52, ఢిల్లీలో రూ.94.57గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.110.09 ఉండగా.. డీజిల్ ధర రూ.103.18కి చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రోల్ ధర అత్యధికంగా లీటరుకు రూ.117.86 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధనాల ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పీపా బ్రెంట్ రకం ముడిచమురు ధర 84 డాలర్ల ఎగువన కదలాడుతోంది. ఏడేళ్లలో తొలిసారి ధర ఈ స్థాయికి చేరింది. సంపన్నులు ప్రయాణించే విమానాల్లో వాడే ఇంధన ధరల కన్నా సామాన్యులు తమ వాహనాల్లో వినియోగించే ఇంధనాల ధరలే ఎక్కువగా ఉండటం సగటు జీవులకు భారంగా మారుతోంది. ఢిల్లీలో కిలోలీటరు విమాన ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎ్‌ఫ) ధర రూ.79,020.16 లేదా లీటరు ధర రూ.79. లీటరు పెట్రోల్ ధర రూ.105.84. అంటే లీటరు పెట్రోల్ ధర ఏటీఎఫ్ కన్నా 33ు ఎక్కువ. 2014 నవంబరులో ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.62,537 (లీటరు ధర రూ.62.5) స్థాయిలో ఉండగా.. లీటరు పెట్రోల్ ధర రూ.64 స్థాయిలో ఉంది. అంటే దాదాపు వీటి ధరలు సమాన స్థాయిలో ఉన్నాయి. అంటే లీటరు ఏటీఎఫ్ ధర రూ.16.5 వరకు పెరిగితే.. పెట్రోల్ ధర రూ.41 వరకు పెరిగింది.

Share this on your social network: