కరెంటు మోత ...

Published: Tuesday October 19, 2021

ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి తక్షణ కారణం బొగ్గు కొరత. ఈ విద్యుత్ గండానికి మరో మూడు కారణాలు కూడా చెబుతున్నారు. అవి: కొవిడ్ విపత్తు చాలవరకు తొలగిపోయినందున ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకున్న ఫలితంగా విద్యుత్‌కు డిమాండ్ ఇతోధికంగా పెరిగిపోవడం; ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతులపై చైనా ఆంక్షలు విధించడం వల్ల ఇతర దేశాల బొగ్గుకు డిమాండ్ పెరిగి అంతర్జాతీయ విపణిలో ఆ నల్ల బంగారం ధర అమాంతం ఆకాశానికి అంటడం; సౌర, పవన విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిచ్చి బొగ్గుగనుల తవ్వకాలలో మదుపులు తక్కువగా చేయడం. ఈ మూడు కారణాలూ అంగీకారయోగ్యమైనవి కావు. అసలు కారణం భూ తాపం (గ్లోబల్ వార్మింగ్). 

 

 

విద్యుదుత్పత్తి తగ్గిపోవడం, అదే సమయంలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోవడం రెండూ భూ తాపం పుణ్యమే. విద్యుదుత్పత్తి తగ్గిపోవడానికి కారణాలు: ఒకటి–- భారత్, చైనా, ఆస్ట్రేలియాతో సహా వివిధ దేశాలలోని బొగ్గు గనులలోకి వరదజలాలు పెద్దఎత్తున ప్రవేశించడంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయి ధర పెరిగింది. రెండు–- అమెరికాలో విద్యుదుత్పత్తి అధికంగా జరిగే టెక్సాస్, లౌసియానా మొదలైనవి తుపానుల తాకిడికి గురికావడంతో చమురు ఉత్పత్తి తగ్గిపోయింది. మూడు-– ‘పొడి వాతావరణం’ కారణంగా చైనాలో జలవిద్యుదుత్పత్తి తగ్గిపోయింది. పవనాల వేగం కూడా తగ్గిపోవడంతో పవన విద్యుదుత్పత్తి కూడా మందగించింది. 

 

ఇదిలాఉంటే విద్యుత్, చమురు వినియోగం బాగా అధికమయింది. గత ఏడాది యూరోపియన్ దేశాలు సుదీర్ఘ శీతాకాలాన్ని ఎదుర్కొన్నాయి. గృహాలను వెచ్చగా ఉంచుకునే నిమిత్తం చమురు వినియోగం ఇతోధికమయింది. యూరోపియన్ దేశాలలోని చమురు నిల్వలు గత శీతాకాలంలోనే పూర్తిగా అడుగంటిపోయాయి. వచ్చే శీతాకాలం కూడా చాలా సుదీర్ఘంగా ఉండగలదని భావిస్తున్నారు. తత్కారణంగా యూరోపియన్ దేశాలు ముందు జాగ్రత్తగా చమురును భారీ పరిమాణంలో నిల్వ చేసుకోసాగాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరిగాయి. ఇలా చమురు వినియోగం పెరుగుదలతో పాటు బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గుదలకు భూతాపం దారితీయడం వల్లే ప్రస్తుత సంక్షోభం నెలకొంది.

 

మనదేశంలో విద్యుదుత్పత్తికి ప్రధానంగా ఉపయోగిస్తున్న ముడి వనరు బొగ్గు. మనం ఉపయోగించుకునే బొగ్గులో 90 శాతం దేశీయ గనుల నుంచే లభ్యమవుతున్నది. మిగతా పది శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు దిగుమతి చేసుకుంటున్న బొగ్గు పైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరిగినప్పుడల్లా ఈ థర్మల్ విద్యుత్కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర కూడా అనివార్యంగా పెరిగిపోతుంది. విద్యుత్ బోర్డులు ఆ ఖరీదైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు తిరస్కరిస్తున్నాయి. దీంతో ఆ విద్యుత్‌ కేంద్రాలు మూతపడుతున్నాయి. ఈ క్రమంలో విద్యుదుత్పత్తి ప్రతికూలంగా ప్రభావితమై సంక్షోభానికి దారితీసింది. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల మూసివేత కారణంగా విద్యుదుత్పత్తిలో స్వల్ప తగ్గుదల సంభవించి పెద్ద సంక్షోభానికి దారితీసింది. ఒక రోగి జ్వర తీవ్రత 104 నుంచి 105 డిగ్రీలకు పెరిగితే ఎంత ఆందోళనకరమో ప్రస్తుత విద్యుత్ సంక్షోభ పరిస్థితి కూడా అంతే. 

 

సమీప భవిష్యత్తులోనే ఇటువంటి సంక్షోభాలు తరచు సంభవించే అవకాశముంది. మన ప్రత్యేక సమస్య ఏమిటంటే, దిగుమతి చేసుకుంటున్న వనరులపై పెద్దఎత్తున ఆధారపడి ఉన్నాం. మన చమురు అవసరాలలో 85 శాతాన్ని, బొగ్గు అవసరాలలో 10 శాతాన్ని దిగుమతి చేసుకోక తప్పడం లేదు. అంతర్జాతీయ విపణిలో ఈ ముడి పదార్థాల ధరలు తరచు పెరుగుదల–-తగ్గుదలకు లోనవుతున్నాయి. ఈ ప్రపంచ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డిజీల్, సహజవాయువు, విద్యుత్ ధరలు పెరుగుతూ తరుగుతూ లేదా తరుగుతూ పెరుగుతూ ఉంటాయి. విద్యుత్ విక్రయధరను దీర్ఘకాలిక ప్రాతిపదికన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయిస్తాయి. తత్కారణంగా స్వల్పకాలిక విద్యుదుత్పత్తి వ్యయానికి, దీర్ఘకాలిక విద్యుత్ విక్రయ ధరకు పొంతన లేకుండా పోయింది. ప్రస్తుతం మనం చవిచూస్తున్న విద్యుత్ సంక్షోభానికి ఉత్పత్తి వ్యయం, విక్రయ ధర మధ్య భారీ వ్యత్యాసం ఒక కారణంగా చెప్పి తీరాలి.