ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Published: Sunday October 24, 2021

విద్యార్థులపై ఫీజుల మోత మోగనుంది. ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వం ఇస్తున్న సాయం ఆపేసి.. ఫీజుల రూపంలో ఆ భారం విద్యార్థులపై వేసింది. ప్రైవేటుగా మారిన ఎయిడెడ్‌ పాఠశాలల్ని ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతించింది. వాటికి ఫీజులు కూడా నిర్ణయించింది. అవి దాదాపుగా ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న స్థాయిలోనే ఉన్నాయి. గ్రామస్థాయి పాఠశాలల్లో 1నుంచి 5వ తరగతి వరకు రూ.10వేలు, 6 నుంచి పదోతరగతి వరకు రూ.12వేలు.. పట్టణాల్లో రూ.12వేలు, రూ.15 వేలుగా నిర్ణయించారు. నగరాల్లో రూ.15 వేలు, రూ.18 వేలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ మేరకు నిర్ణయించగా, ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. హాస్టల్‌ సౌకర్యం ఉంటే.. గ్రామాల్లో ఏడాదికి రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేలు వసూలు చేయవచ్చని తెలిపారు. ఫీజులుగా వసూలు చేసిన మొత్తంలో 50శాతం ఉపాఽధ్యాయులకు, 15శాతం సిబ్బంది గ్రాట్యుటీ, బీమా తదితరాలకు, 15శాతం పాఠశాల నిర్వహణ, 20 శాతం పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు లెక్కలు కూడా చూపించాలన్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఈ ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలల్లో ఉచితంగా చదువు చెప్పారు. పిల్లల నుంచి పైసా వసూలు చేయలేదు. ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసేసుకోవడంతో ఇప్పుడు ఆయా పాఠశాలలు కొత్తగా నియమించుకుని వారికి జీతాలు కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటిని ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. వాటిల్లో చదివే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి తాజాగా ప్రభుత్వం అనుమతించింది.

అమ్మ ఒడి ఇప్పటికే ఓ ఏడాది లేదు

ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేస్తామని, వారిపై పడే భారం ఏమీ ఉండదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఐదేళ్లు ఇవ్వాల్సిన అమ్మఒడిని ఒక ఏడాది వాయిదా వేసేశారు. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదు. 

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పూర్తి చేసుకున్నవారికి బెటర్‌మెంట్‌ పరీక్షలనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల పేరుతో నిర్వహించారు. ఫలితాల వివరాలు బీఐఈ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో పెట్టారు. మార్కుల మెమోల్ని ఈ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏవైనా ఫిర్యాదులుంటే 9391282578 నంబరకు ఫోన్‌ చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.