పత్తి రైతు పంట పండింది..ప్రైవేటు వ్యాపారులకే అమ్మకం!

Published: Monday November 01, 2021

పత్తి రైతుల పంట పండింది. తెల్ల బంగారం ధర మెరిసిపోతోంది. రైతుల ఇంట కాసుల వర్షం కురుస్తోంది. మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌ ఏడాదంతా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ధర ఇంకా పెరిగే సూచనలూ ఉన్నాయి. అధిక వర్షాల కారణంగా చాలా రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని చెప్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పత్తికి డిమాండ్‌ వస్తోంది. రాష్ట్రంలోని ఆధోని మార్కెట్‌లో గత నెల రోజులుగా పత్తి క్వింటా రూ.7,500 నుంచి రూ.8,500 దాకా ధర పలుకుతోంది. తెలంగాణలోనూ రూ.7వేల వరకు ధర వస్తోంది. కర్ణాటకలో కొన్ని చోట్ల ఇప్పటికే రూ.10వేలపైగా ఇస్తున్నారు. ఈ డిమాండ్‌ ఇలాగే కొనసాగి.. మరో నెల రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో క్వింటా పత్తి రూ.10వేలు దాటే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలే చెప్తున్నాయి. ఈ ఏడాది పొడుగు పింజ పత్తికి రూ.6,025, మధ్యస్థ పింజ పత్తికి రూ.5,726గా కేంద్రప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అయితే ఏపీలో ఆధోని, తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం, కర్ణాటకలోని చిత్రదుర్గ మార్కెట్లలో ఎమ్మెస్పీని మించి రికార్డు ధర లభిస్తోంది. కనిష్ట ధర కూడా రూ.5వేలకు తగ్గడం లేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తున్న పత్తికి ప్రస్తుతం మంచి ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతినడం, దక్షిణాది రాష్ట్రాల్లో తొలి తీత పత్తి నాణ్యతగా ఉండటం వల్ల మంచి ధర లభిస్తోందని మార్కెటింగ్‌ అధికారులు చెప్తున్నారు. 

ఏపీలో నిరుడు కంటే ఈ ఏడాది పంట సాగు కొంత తగ్గినా, రాష్ట్రంలో 13.5 లక్షల ఎకరాల్లోసాగైన పంటతో.. దాదాపు కోటి క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుతం పత్తి పూత, కాయ దశలో ఉన్నది. దీపావళి తర్వాత పత్తి తీయడం ముమ్మరం కానున్నది. అందువల్ల వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 50 మార్కెట్‌ యార్డులు, 73 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ నిర్ణయించింది. అయితే 8ు మించి తేమ ఉంటే ధరలో కోత పడుతుందని, 12ు మించి తేమ ఉంటే కొనుగోలు చేయ బోమని మార్కెటింగ్‌ శాఖ స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా మంచిధరలు ఉన్నందున రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే పత్తిని అమ్మే అవకాశాలున్నాయి. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాయలసీమ, దక్షిణకోస్తాలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే పత్తి తడిసిపోతుందని, పంట పాడయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.