అమ్మఒడి అందాలంటే ఇలా చేయాల్సిందే.
అమ్మఒడి పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకురానుంది. సోమవారం నుంచి ఈ విధానం అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే అందుకు యంత్రాలు, ఇతరత్రా సామగ్రి పంపిణీ చేయకపోవడంపై అమలుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 1 నుంచి ఇంటర్మీడియేట్ వరకు చదివే విద్యార్థుల తల్ల్లి ఖాతాలో ప్రభుత్వం ఏటా రూ.14 వేలు జమ చేస్తోంది. విద్యార్థికి 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు లేవు, ఉన్నా పని చేయడం లేదు. మరికొన్ని చోట్ల సిగ్నల్స్ సరిగా అందవు. ఈ విధానంతో పలువురు విద్యార్థులు పథకానికి దూరమయ్యే అవకాశముంది.
ఈనెల 8 నుంచి పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో అమలుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాలు అందజేయలేదని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. ఉదయగిరి ఉన్నత పాఠశాలలో 720 మంది విద్యార్థులు ఉన్నారు. వారు బయోమెట్రిక్ హాజరు వేయాలంటే 7 నుంచి 10 యంత్రాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వారికి యంత్రాలు అందలేదు. మరోవైపు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో సిగ్నల్స్ సమస్య అధికంగా ఉంటుంది. సిగ్నల్స్ అందనిచోట కొందరు ఉపాధ్యాయులు మాన్యువల్ పద్ధతిలో హాజరు వేస్తున్నారు. విద్యార్థులు హాజరు బయోమెట్రిక్‌లో తీసుకుంటే సమయం ఎక్కువ కావడంతోపాటు వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Share this on your social network: