నాయకులు చేసే చేష్టలు రాజకీయాలను రోత పుట్టిస్తున్నాయి

Published: Saturday November 13, 2021

‘ప్రస్తుతం కొందరు నాయకులు చేసే చేష్టలు రాజకీయాలను రోత పుట్టిస్తున్నాయి. అటువంటి వారు తన మాటలను తీసుకుని పాత పద్ధతులకు వస్తారని ఆశిస్తున్నా. జనంలో తిరుగుతూ జనానికి మంచి పనులు చేయడంలో ఉండే సంతోషం రాజ్యాంగ పదవిలో లేదు. నాకు ఉపరాష్ట్రపతి హోదా అలంకారంగా అనిపిస్తోంది. స్వేచ్ఛగా తిరగాలని మనసు కోరుకుంటూ ఉంది’’ అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం నెల్లూరుకు విచ్చేశారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగిన లాయర్‌ పత్రిక 40వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. త్వరగా ఢిల్లీ నుంచి నెల్లూరుకు తిరిగి వచ్చి సమాజ సేవ చేయాలని కోరికగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. కానీ అందరూ తాను రాష్ట్రపతి అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. నేడు ఒక పత్రిక చదివితే నిజం తెలియడం లేదని నాలుగైదు పత్రికలు చదివితేకాని ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం చేసుకోలేకపోతున్నామన్నారు. సోషల్‌ మీడియా యాంటీ సోషల్‌ మీడియాగా తయారైందన్నారు. దీనిపై కట్టడి జరగాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. మాతృభాషను మాట్లాడితేనే భాష మనుగడ సాగిస్తుందని భాష లేకపోతే వ్యక్తీకరణ సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చైర్మన్‌ గంటా సతీ్‌షరెడ్డి, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ కె.వరప్రసాద్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. శుక్రవారం మధ్యాహ్నం 11.53గంటలకు రేణిగుంట నుంచి ప్రత్యేక రైలులో వెంకటాచలం చేరుకున్న వెంకయ్యకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు.