ఒక మార్పు కోసమే ఈ పోరాటo

Published: Saturday November 13, 2021

నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ తరపున అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. మరికొన్ని పురపాలక, నగర పాలక సంస్థల్లోనూ, ప్రజా పరిషత్తుల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీలో నిలిచిందన్నారు. ఒక మార్పు కోసమే ఈ పోరాటమన్నారు. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారని  విజ్ఞులైన మీకు తెలిసిన విషయమేనన్నారు. అన్ని వేళలా ప్రజల కోసం పని చేస్తూ,  ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పించామని పవన్ తెలిపారు. స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందన్నారు. జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.