పౌరసత్వానికి గుడ్‌బై చెప్పేస్తున్నారు.. ఐదేళ్లలో..

Published: Wednesday December 01, 2021

 భారత పౌరసత్వాన్ని గత ఐదేళ్లలో ఎంత మంది వదులుకున్నారన్న అంశంపై కేంద్రప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇదే సమయంలో ఎంత మంది విదేశీయులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం పార్లమెంట్ శీతకాల సమావేశాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్యను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. గత ఐదేళ్లలో అంటే 2017 నుంచి సెప్టెంబర్ 30 నాటికి దాదాపు 6లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ప్రకటించారు. 2017లో 1,33,049 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా.. 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,248 మంది, 2021 సెప్టెంబర్ 30 నాటికి 1,11,287 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్టు వివరించారు. అయితే భారతీయులు ఎందుకు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారన్న అంశంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. 

 

 

 

ఇదే సమయంలో గడిచిన ఐదేళ్లలో 10,645మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.. 4,177మందికి మంజూరైందని నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. 2016-2020 మధ్య వచ్చిన దరఖాస్తుల్లో అమెరికా నుంచి 227, అప్ఘనిస్థాన్‌-795, బంగ్లాదేశ్‌ నుంచి 184 ఉన్నాయన్నారు. పాకిస్థాన్‌ నుంచి అత్యధికంగా 7782 వచ్చాయన్నారు. 2016లో 1106మంది, 2017-817, 2018-628, 2019-987, 2020లో 639మంది భారత పౌరసత్వం పొందారని ఆయన వివరించారు. 

 

ఇదిలా ఉంటే.. అత్యంత శక్తి వంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 69వ స్థానంలో ఉంది. దీంతో వీసా లేకుండా భారతీయులు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు, సంపన్నులు తమ పౌరసత్వాన్ని వదులుకుని, విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. అత్యంత శక్తి వంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో యూఏఈ మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉంది.