సెమీకండక్టర్ల డిజైన్, తయారీ ప్రాజెక్టుకు రూ.76,000 కోట్లు

Published: Wednesday December 15, 2021

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీకండక్టర్లు, డిస్‌ప్లే బోర్డుల ఉత్పత్తి మన దేశంలోనే జరిగేందుకు రూ.76,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సెమీకండక్టర్ చిప్స్ డిజైన్, తయారీ మన దేశంలోనే జరగబోతున్నాయి. 

 

 

కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా మన దేశంలో  సెమీకండక్టర్ చిప్స్ డిజైన్, తయారీ కోసం రూ.76,000 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. రానున్న ఐదు లేదా ఆరు సంవత్సరాల్లో మన దేశంలోనే సెమీకండక్టర్ల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ‘ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. 

 

ఈ ప్రాజెక్టు వల్ల దేశవ్యాప్తంగా అనేక రంగాలపై అనేక రకాలుగా మంచి ప్రభావం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. 2025నాటికి మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేవిధంగా సెమీకండక్టర్లు, డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్, డిజైన్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో నూతన శకానికి ఈ కార్యక్రమం బాటలు పరుస్తుందని చెప్పింది.