కొత్త సంవత్సరం విక్రయాలకు ఏర్పాట్లు

Published: Thursday December 23, 2021

కొత్త సంవత్సరం వేడుకల్లో మందు బాబులకు 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచేలా స్వయానా అధికారులే అంతర్గత ఏర్పాట్లు చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకుగాను గ్రామాల్లోని బెల్టు షాపులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ పరిధిలోని బాలాపూర్‌ మండలంలో బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్ల పరిధిలోని అనేక గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయినా.. ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోక పోవడాన్ని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక్కడి మీర్‌పేట్‌, జిల్లెలగూడ, నందనవనం, భూపేశ్‌గుప్తానగర్‌, దాసరినారాయణకాలనీ, లెనిన్‌నగర్‌, అల్మాస్‌గూడ, రాజీవ్‌ గృహకల్ప, గాంధీనగర్‌, బడంగ్‌పేట్‌, నాదర్‌గుల్‌, మల్లాపూర్‌, వెంకటాపూర్‌ తదితర ప్రాంతాల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉంటోందని, అక్కడి బెల్టు షాపుల నిర్వాహకులు మందుబాబులకు ‘సేవలు’ అందిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

 
పలు గ్రామాల్లోని బెల్టు షాపులలో పత్తాల ఆట(జూదం) కూడా ఆడిస్తున్నట్టు తెలిసింది. అల్మాస్‌గూడలోని ఓ బెల్టు షాపులో ఉదయం 6 గంటల నుంచే మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు తెలిపారు. అక్కడ రాత్రి 11 గంటల దాకా జూదం ఆడుతున్నారని, నిర్వాహకులు దగ్గరుండి మరీ వారికి అన్ని సదుపా యాలూ కల్పిస్తున్నారని అంటున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోని బెల్టు షాపుల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు స్థానికుల ద్వారా తెలుస్తోంది.  

 

కరోనా కారణంగా కొత్త సంవత్సరం వేడుకలపై పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో సంబరాల్లో మునిగిపోయే వారి కోసం 31వ తేదీ రాత్రంతా మద్యం అందుబాటులో ఉంచడానికి బెల్టు షాపులలో అనధికార ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నెల క్రితం షాపులు దక్కించుకున్న వైన్స్‌ నిర్వాహకులు సైతం బెల్టు షాపుల ద్వారా విక్రయాలు పెంచుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. సంబంధిత ఎక్సైజ్‌ విభాగం అధికారులు కూడా ప్రభుత్వం విధించిన టార్గెట్లు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కొత్త దుకాణదారులకు తమ వంతు సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

 

బెల్టు షాపులపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ ఎక్సైజ్‌, సివిల్‌ పోలీసులు చెబుతున్నప్పటికీ.. తరచుగా పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్‌ సెర్చ్‌లో మద్యం బాటిళ్లే ఎక్కువగా దొరుకుతుండడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొత్తగా వచ్చిన వైన్‌ షాపులకు అనుబంధంగా కొనసాగుతున్న బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని బస్తీలు, గ్రామాల్లో మద్యం లభించకుండా చూడాలని కోరుతున్నారు.