మోదీ నిబద్ధతను ప్రశంసించిన టాటా

Published: Thursday January 27, 2022

‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పాలన’కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతతో కృషి చేస్తున్నారని టాటా గ్రూప్ గురువారం ఓ ప్రకటనలో ప్రశంసించింది. సంస్కరణలకు ఆయన కట్టుబడి ఉన్నారని, భారత దేశ ఔత్సాహిక పారిశ్రామిక రంగం శక్తి, సామర్థ్యాల పట్ల ఆయనకు గొప్ప నమ్మకం ఉందని పేర్కొంది. ఎయిరిండియా గురువారం అధికారికంగా ఈ గ్రూప్ సొంతమైన నేపథ్యంలో ఈ ప్రకటనను విడుదల చేసింది. 

‘‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పాలన పట్ల తన నిబద్ధత గురించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చర్యల ద్వారా వివరించి చెప్పారు’’ అని టాటా గ్రూప్ ప్రకటన పేర్కొంది. అంతకుముందు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 

 

ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీలకు సంబంధించిన అధికారిక లాంఛనాలన్నీ పూర్తయినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు వచ్చిందని చెప్పారు. షేర్స్‌ను నూతన యజమాని Talaceకు బదిలీ చేసినట్లు చెప్పారు. ప్రతిఫలం సొమ్మును స్వీకరించినట్లు తెలిపారు. రూ.15,300 కోట్ల రుణాన్ని నూతన యాజమాన్యం అంగీకరించిందన్నారు. నూతన బోర్డు ప్రస్తుతం సమావేశాన్ని నిర్వహిస్తోందన్నారు. 

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇచ్చిన ట్వీట్‌లో, ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడం గమనించదగిన అంశమని పేర్కొన్నారు. నాన్ స్ట్రాటజిక్ రంగాల్లో భవిష్యత్తులో చురుగ్గా పెట్టుబడుల ఉపసంహరణను సమర్థవంతంగా  నిర్వహించగల సత్తా ప్రభుత్వానికి ఉన్నట్లు ఈ ప్రక్రియ రుజువు చేసిందన్నారు. 

ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ ‘‘మహారాజా’ను ఇక పూర్తిగా  టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. 

శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. 

గురువారం ఉదయం ఎయిరిండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌‌నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది. టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతోంది.