జగన్ ఏం చేస్తున్నారు: పవన్
Published: Wednesday February 02, 2022
పోలవరం ప్రాజెక్ట్ నిధుల సాధనలో ఎందుకింత అలసత్వమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 28 మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యమని ఆయన విమర్శించారు. జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు కనిపించలేదన్నారు. 22మంది వైసీపీ లోక్సభ సభ్యులు, ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లని నిలదీశారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం వస్తోందని పవన్ అన్నారు.
‘‘ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రకటనల్లో మాత్రం పోలవరం గురించి అడిగాం అంటారు. కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమే. ఈ విధంగా అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుంది?. యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. అంటే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులు ఇస్తోంది. అంటే వైసీపీ ప్రభుత్వం అలసత్వం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పం ఉన్నట్లు లేదు. నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కూడా అంచనాలకు అందటం లేదు.’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

Share this on your social network: