చెత్త పన్ను చెల్లింపుపై విముఖత..

Published: Sunday February 06, 2022
 

à°“ పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఆర్భాటంగా చెప్పుకోవడం.. మరోపక్క ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే మార్గాలను అన్వేషించడం.. వైసీపీ సర్కారుకు పరిపాటిగా మారింది. ఇప్పటికే ఎడాపెడా అప్పులు చేసిన జగన్‌ ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో పలు పేర్లతో పథకాలు తీసుకొచ్చి ప్రజల నుంచి వసూళ్లకు శ్రీకారం చుడుతోంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో ఓటీఎస్‌ పథకం, ఎప్పుడో కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పుడు లబ్ధిదారులకు కేటాయించి బ్యాంకుల ద్వారా à°† ఇళ్ల రుణాలను వసూలు చేయాలనుకోవడం, టౌన్‌షి్‌పల పేరుతో ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకోవడం.. ఇలా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ పైసా వసూల్‌కు సిద్ధమవుతోంది. చివరకు చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్నుల వసూలులోనూ చీప్‌à°—à°¾ వ్యవహరిస్తూ విమర్శల పాలవుతోంది. à°ˆ పన్నులు చెల్లించలేకుంటే వారికి ఇచ్చే సామాజిక పెన్షన్ల నుంచి మినహాయించుకోవడం, లేదంటే ఆపేయడం విమర్శలకు కారణమవుతోంది.

 

పెన్షన్‌ నుంచి కట్‌ చేయండి..

ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే పెన్షన్‌ డబ్బులు కోసం రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల à°ˆ పింఛను డబ్బులకు కూడా వలంటీర్లు చిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల ఇంటి పన్నులు చెల్లించలేదని అవ్వా తాతలకు వచ్చే పెన్షన్లు పెండింగ్‌లో పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో పలుచోట్ల ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను చెల్లించని వారి కుటుంబంలో పింఛనుదార్లు ఎవరైనా ఉంటే.. వారికొచ్చే పెన్షన్‌ నుంచి à°† సొమ్ముని కట్‌ చేయాలని పంచాయతీ కార్యదర్శులు వంలంటీర్లను ఆదేశిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని బోరంపాడులో ఇంటి పన్నులు చెల్లించలేదని పేర్కొంటూ.. వచ్చే పింఛనులో రూ.200 తగ్గించి ఇచ్చారు. దీంతో ఇదేం చోద్యమంటూ అవ్వాతాతలు మండిపడుతున్నారు. జగన్‌ ప్రభుత్వం à°’à°• చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటోందని కొందరు విమర్శిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ à°ˆ పరిస్థితి ఉందని ఉందంటున్నారు. సంక్షేమ పథకాలు ఏమొచ్చినా.. వలంటీర్లు గద్దల్లా వాలి ఇంటి పన్ను, చెత్త పన్ను, ఓటీఎస్‌ వంటికి వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పట్టణాల్లో, గ్రామాల్లో ఆర్భాటంగా చెత్త వాహనాలను కొనుగోలు చేసి ఔట్‌సోర్సింగ్‌ ద్వారా చెత్త సేకరణ చేపట్టింది. దీనికోసం ఒక్కో ఇంటినుంచి రూ.60 నుంచి రూ.100 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. గతంలో పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు రుసుం వసూలుచేసిన దాఖలాల్లేవు. à°ˆ ప్రభుత్వం మాత్రం గతేడాది నవంబరు నుంచి పట్టణాల్లో, నగరాల్లో 23.60 లక్షల కుటుంబాల నుంచి చెత్త సేకరిస్తూ వారి నుంచి రూ.70.14 కోట్ల మేర చెత్త పన్ను వసూలుకు డిమాండ్‌ నోటీసులిచ్చింది. కానీ.. 7.24 లక్షల కుటుంబాలు మాత్రమే స్పందించి రూ.94.68 లక్షలు చెల్లించాయి. అంటే చెత్తపన్ను రూపంలో 8.24 శాతం మాత్రమే వసూలైంది. ఇంకా రూ.64.35 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో అధికారులు ఏదో à°’à°• à°°à°•à°‚à°—à°¾ వసూలు చేయాలని వలంటీర్లకు టార్గెట్లు పెడుతున్నారు. దీంతో వారు సామాజిక పెన్షన్లను కూడా వదలడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు చేపట్టాల్సిన కనీస కార్యక్రమాలకు పన్నులు వసూలు చేయడం ఏమిటని, వాటికోసం పింఛన్లు కట్‌ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.