జీఎస్టీ ఆడిట్‌ తనిఖీల్లో వసూళ్ల పర్వం

Published: Sunday February 06, 2022

వాణిజ్య పన్నుల(కమర్షియల్‌ టాక్స్‌)శాఖలో అవినీతి శ్రుతి మించిపోయిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పేరుకు తగ్గట్లే వారిలో కొందరి మైండ్‌సెట్‌ కూడా కమర్షియల్‌గా మారిపోయింది. గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌ (జీఎస్టీ) చట్టం అమల్లోకి వస్తే అవినీతి తగ్గిపోతుందనుకున్నారు. ఆ అభిప్రాయం చాలా తప్పని త్వరగానే తేలిపోయింది. లారీ చెకింగ్‌ నుంచి ఆడిట్‌ తనిఖీల వరకు జీఎస్టీ ముసుగులో ఆ శాఖాధికారులు సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ శాఖలో కొందరు ఆడిట్‌ పేరుతో తనిఖీలు నిర్వహించి, అక్కడ కనిపించే తేడాలతో భయపెట్టి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. పన్నుల శాఖలో లార్జ్‌ టాక్స్‌ పేయర్‌ యూనిట్‌ (ఎల్‌టీయూ) నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. జిల్లాలోని పలు పట్టణాల్లో వివిధ వ్యాపార సంస్థలు ఏటా రూ.కోట్లలో టర్నోవర్‌ జరుపుతుంటాయి. దీన్ని కొందరు అధికారులు బాగానే వాడుకుంటున్నారు. రెండేళ్ల క్రితం నగరంలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో తనిఖీలు చేయగా.. రూ.5కోట్ల టర్నోవర్‌ జరిగినట్లు గుర్తించారు. ఆ మేరకు 18 శాతం జీఎస్టీ మేరకు రూ.90లక్షలు చెల్లించాలి. అధికారులు టోకరా వేసి, రూ.1.5కోట్లే టర్నోవర్‌ జరిగినట్లు నమోదు చేశారు. అందుకు ఆ అధికారులు రూ.30 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 8 నెలల క్రితం ఓ గ్రానైట్స్‌ సంస్థలో తనిఖీలు చేసి, ముడుపులు ఇవ్వమని కోరడంతో ఆ డీలర్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా ఓ అధికారి టవర్‌క్లాక్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ఆడిట్‌ చేయగా భారీగానే తేడా కనిపించింది. తమ దగ్గర అంత టర్నోవర్‌ జరగలేదన్నట్లు తప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. ఇలా ఆడిట్‌ చేస్తే వారి వ్యాపార నిర్వహణ చిట్టా అంతా బయటకు తీయాల్సిందే. కానీ అలా జరగటం లేదు.

 

పన్నుల శాఖలో ఎల్‌టీయూ విభాగ అధికారులు ప్రస్తుతం ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంలోని కొంతభాగం, హిందూపురం, కదిరి, ధర్మవరం పట్టణాల్లో చేస్తున్నారు. ఆరునెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయంలో సీటీఓలు, డీసీటీఓ స్థాయి అధికారులు కూడా లేరు. ఏసీటీఓలు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్ల ద్వారానే కథ నడుస్తోంది. ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ తతంగం సాగుతోందని సమాచారం. జిల్లాలో ఐరనఓర్‌ పెద్దమొత్తంలో జరిగే జీరో బిజినెస్‌. దీంతోపాటు హిందూపురం పట్టణం వ్యాపారానికి పెట్టింది పేరు. వేరుశనగ విత్తనాలు కూడా జీరో బిజినె్‌సలోనే చేస్తారు. ధర్మవరం పట్టుచీరలకు పేరుగాంచింది. ఇవి కాకుండా రూ.కోట్లలో బిజినెస్‌ జరిగే వ్యాపార సముదాయాలు ఎన్నో ఉన్నాయి. తనిఖీల సందర్భంగా ఏడాది టర్నోవర్‌ను పరిశీలిస్తారు. జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం లెక్కన చెల్లించాలి. తేడా తక్కువ చూపించి, తక్కువ జీఎస్టీ చెల్లించేలా అధికారులే సాయపడతారన్నమాట. పనులు చేసే కాంట్రాక్టర్లను కూడా వదలటం లేదట. రూ.2కోట్ల బిజినెస్‌ టర్నోవర్‌ తేలిన వారికి రూ.కోటికి అటుఇటుగా టర్నోవర్‌ చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా డీలర్లు (వ్యాపారులు) ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు మొదలుకొని రూ.30 లక్షల వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నెలక్రితం వాటాల్లో వివాదం ఏర్పడిందో ఏమో కానీ ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను ఇంకో విభాగానికి మార్చేశారట. తనకు వచ్చే ఆదాయాన్ని లేకుండా చేశారని ఆయన తెగ బాధపడిపో తున్నాడట.

డీలర్ల నుంచి వసూళ్ల వ్యవహారంలో ఓ ఇద్దరు ఏసీటీఓలే కీలకంగా వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. ఆడిట్‌ తనిఖీలు పూర్తయిన తరువాత లెక్కల్లో తేడాలు కనిపించగానే బేరం మొదలుపెడతారట. ఓ ఏసీటీఓ ఎంత మొత్తం తగ్గించాలో చెప్పి... ఆ డీలర్‌ ఎంత ఇవ్వాలో చెబుతాడట. భారీ మొత్తంలో తేడాను తగ్గిస్తేనే అధికారులు అడిగినంత ఇవ్వడానికి ఆ డీలర్లు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు డీల్‌ కుదిర్చేస్తారట. ఇక ఆ తరువాత మరో ఏసీటీఓ ఆ వసూళ్ల వ్యవహారం చూస్తారట. ఆడిట్‌లో ఆయా డీలర్లు తప్పులను కప్పిపుచ్చినందుకు ప్రత్యేకంగా ముడుపులు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వసూళ్ల పర్వం ఆ శాఖ ఉన్నతాధికారికి తెలియకుండానే గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆడిట్‌ సందర్భాల్లో ముడుపులకు అలవాటు పడి టర్నోవర్‌ తేడా చూపడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రావాల్సిన పన్నుకు టోకరా పడుతుందనడంలో సందేహం లేదు.