సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై విమర్శలు

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఇంధన శాఖ వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నా ఎక్కువ ధర చెల్లించేందుకు సిద్ధమైంది. పైగా ఇదే అతి తక్కువ ధర అంటూ సమర్థించుకుంటోంది. రాష్ట్రావసరాల కోసం 7000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేందకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంది. ఇందుకు ఏపీఈఆర్‌సీ ఆమోదం కూడా తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం న్యాయ పరిశీలనలో ఉంది. ఇదే సెకీ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టెండర్లు పిలిస్తే.. 1785 మెగావాట్లను యూనిట్ రూ.2.17కే ఇచ్చేందుకు ఎన్‌టీపీసీతో సహా పలు ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయి. ఒకే ప్రభుత్వరంగ సంస్థ ఒక రాష్ట్రానికి ఒక ధర.. మరో రాష్ట్రానికి అంతకంటే ఎక్కువ ధరకు విద్యుత్ ఇస్తానంటూ ప్రతిపాదించడం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా సంప్రదాయేతర ఇంధనాన్ని వాస్తవ లెక్కల్లో 25 శాతం తగ్గించి తీసుకుంటారు. ఈ విధంగా పరిగణనలోనికి తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 7000 మెగావాట్లను 17,000 మిలియన్ యూనిట్లుగా లెక్కించారు. ఈ లెక్కన యూనిట్‌కు రూ.2.49 లెక్కన తీసుకుంటే రూ.4233 కోట్లు అవుతుంది. అదే యూనిట్‌కు రూ.2.17 లెక్కన పరిగణనలోనికి తీసుకుంటే రూ.3689 కోట్లు అవుతుంది. అంటే రూ.544 కోట్లు వ్యత్యాసం వస్తోంది.
జాతీయ స్థాయిలో సోలార్ విద్యుత్ ధరలు క్రమంగా పడిపోతున్నాయి. యూనిట్‌ను రూ.2.17కే ఇచ్చేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయని ‘మెర్కామ్’ సంస్థ వెల్లడించింది. రాష్ట్ర ఇంధన శాఖ మాత్రం తాము కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డ ధరే అత్యంత తక్కువని చెబుతోంది. దీనిపై విద్యుత్ రంగ నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి 1785 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.17కే ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వస్తే... దీర్ఘకాలంలో ఏకంగా 7000 మెగావాట్లు కొనుగోలు చేస్తామంటే సోలార్ విద్యుత్ సంస్థలు మరింత తక్కువ ధరకే ఇచ్చేందుకు ముందుకొస్తాయని నిపుణులు అంటున్నారు. యూనిట్ రూ.2.17కే సోలార్ విద్యుత్ దొరుకుతుంటే.. ఆ దిశగా అడుగులు వేయకుండా తాము కొంటున్నదే తక్కువ ధరని ఇంధన శాఖ ఎందుకు బుకాయిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అధిక ధరలు చెల్లించేందుకు ఇంధన శాఖ ఎందుకు సిద్ధమవుతోందని అడుగుతున్నారు.
రాష్ట్రంలో రూ.100 కోట్లకు పైన నిధులతో చేపట్టే పనులను రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సెకీ వేసిన బిడ్ ధరలు మారుతుంటే రివర్స్ టెండరింగ్ విధానానికి ఎందుకు వెళ్లడం లేదంటూ ఇంధన సంస్థల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తే.. ఆ ధరనే చెల్లిస్తామని ఒప్పందాల సమయంలోనే ఎందుకు పేర్కొనడం లేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల పెను సమస్యలు ఉన్నాయని అధికారాన్ని చేపట్టిన కొత్తలో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించేందుకు కూడా సిద్ధమయ్యారు. అలాంటిది విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ధరలను పునఃసమీక్షిస్తామన్న షరతును ఎందుకు పెట్టలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోలార్ విద్యుత్ కొనుగోళ్ల కోసం ఇటీవల సెకీని ఆశ్రయించింది. ఆ రాష్ట్రం కోసం సెకీ టెండర్లను ఆహ్వానించగా మంచి స్పందన వచ్చింది. గతేడాది డిసెంబరు 24వ తేదీన టెండర్ బిడ్‌లను తెరిచింది. ప్రముఖ సంస్థలన్నీ యూనిట్‌ను రూ.2.17కే ఇస్తామంటూ ముందుకొచ్చాయి. ఎన్‌టీపీసీ 500 మెగావాట్లు, స్రింగ్ ఎనర్జీ 200 మెగావాట్లు, యూపీసీ రెన్యువబుల్ 90 మెగావాట్లు, మెట్కా ఈజీఎన్ సింగపూర్ 20 మెగావాట్లు చొప్పున యూనిట్ ధర రూ.2.17కు సరఫరా చేస్తామని బిడ్‌లు దాఖలు చేశాయి. రిన్యూ సోలార్ పవర్ 600 మెగావాట్లు, ఏసీఎంఈ 375 మెగావాట్లను యూనిట్‌ను రూ.2.18కు ఇస్తామని బిడ్‌లు వేశాయి. ఇలా తక్కువ ధరకే సోలార్ విద్యుత్ ఇచ్చేందుకు ఉత్పత్తి సంస్థలు ముందుకు రావడం ఇది రెండోసారి.
2020 నవంబరులో 1070 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోసం సెకీ పిలిచిన టెండర్లకు భారీ స్పందన లభించింది. రికార్డు స్థాయిలో యూనిట్‌ను రూ.2కే ఇస్తామంటూ సంస్థలు బిడ్లు వేశాయి. ఏఐ జోమయ్య 200 మెగావాట్లు, ఎనర్జీ, వాటర్ కంపెనీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (సెంబ్‌కార్ప్ అనుబంధ సంస్థ) 400 మెగావాట్లను యూనిట్ రూ.2కే ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఎన్‌టీపీసీ 600 మెగావాట్లను రూ.2.01కు ఇస్తామని బిడ్ వేసింది. ఇందులో 470 మెగావాట్లను మాత్రమే సెకీ తీసుకుంది. స్ర్పింగ్ ఉజ్వల ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ యూనిట్‌కు రూ.2.02 చొప్పున, ఎస్‌జేవిన్ రూ.2.07కు ఇస్తామని కోట్ చేశాయి.

Share this on your social network: