ఆర్బీఐలో బాండ్ల వేలంతోనే 40 వేల కోట్ల అప్పు

‘మా రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వండి. మా ప్రాజెక్టులకు అనుమతులివ్వండి. మా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా చూడండి’’... ఏ ముఖ్యమంత్రైనా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కోరేది ఇవే! కానీ... మన రాష్ట్రం తీరే వేరు! ‘‘మాకు అప్పులు ఇవ్వండి. అదనపు అప్పులకు అనుమతిఇవ్వండి. మా అప్పులకు అడ్డులేకుండా చూడండి’’... కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కోరుతున్నది ఇదే! తప్పుడు మార్గాల్లో అప్పుల మీద అప్పులు చేస్తున్న వైసీపీ సర్కారుకు అవేవీ చాలడంలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు రూ.27,325 కోట్ల అదనపు అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని జగన్ కోరారు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంటులో వెల్లడించింది. అంతేకాదు... గతనెల 3వ తేదీన జగన్ అప్పులకు అనుమతి కోరేందుకే ఢిల్లీకి వచ్చారని తెలిపింది. రెండున్నరేళ్లుగా జగన్ సర్కారు అప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. ఆ అప్పుల అసలు, వడ్డీలు చెల్లించడానికే ఖజానా సరిపోవడంలేదు. ‘తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పటికే నిండా మునిగిపోయాం. ఇక బయటపడే దారే లేదు’ అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
2021-22లో కేంద్రం ఏపీకి రూ.42,472 కోట్లు అప్పు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అయితే... గత మూడేళ్లలో రాష్ట్రం కేంద్రం ఇచ్చిన అనుమతి కంటే అదనంగా రూ.17వేల కోట్లు అప్పు చేసింది. దీంతో... ఆ మొత్తానికి కోత పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం రూ.25,472 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతించింది. అయితే... ‘ఒకేసారి అంత కోస్తే భరించలేం. దానిని మూడేళ్లకు సర్దుబాటు చేయండి’ అని రాష్ట్రం కోరింది. ఇందుకు కేంద్రం అనుమతించిందా, లేదా అనే సంగతి పక్కనపెడితే... రాష్ట్ర సర్కారు యథేచ్ఛగా అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం సహకరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు చాలవన్నట్టు జనవరి, ఫిబ్రవరి, మార్చి కోసం అదనంగా రూ.27,325 కోట్ల అప్పు కావాలని సీఎం జగన్ కోరడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతిచ్చిన రూ.40,655 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్‌బీఐలో సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా మాత్రమే తెచ్చింది. ఈఏపీలు, నాబార్డు, ఎన్‌సీడీసీ రూపంలో తీసుకున్న అప్పులను, ఉద్యోగులకు సంబంధించి వాడుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ నిధులను కూడా కలిపితే... మరో రూ.20వేల కోట్ల వరకు ఉంటాయి. 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 9 నెలల్లో జగన్ ప్రభుత్వం రూ.58,142 కోట్ల అప్పులు చేసినట్టు డిసెంబరు నెలకు సంబంధించిన నివేదికలో ‘కాగ్’ వెల్లడించింది. అంటే, కేంద్రం ఇచ్చిన అనుమతులకంటే వైసీపీ ప్రభుత్వం రూ.18,000 కోట్ల అప్పులు అదనంగా చేసింది.
ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 2021 మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్ర పబ్లిక్ డెట్ రూ.3.55 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాతి 9 నెలల్లో రూ.58,142 కోట్ల అప్పు చేసినట్టు కాగ్ స్వయంగా వెల్లడించింది. వెరసి... ప్రస్తుతం రాష్ట్ర పబ్లిక్ డెట్ రూ.4.13 లక్షల కోట్లకు చేరుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) ప్రకారం ఈ అప్పు మొత్తానికి కౌంటర్ గ్యారంటీ ఉన్నట్టే. రాష్ట్రంలో కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని జగన్ సర్కార్ చేస్తున్న అప్పుల స్కామ్‌పై కేంద్రానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ కేంద్రం ఏపీకి ధారాళంగా అప్పులకు అనుమతి ఇస్తోంది. అవి కూడా చాలవని... మళ్లీ మళ్లీ అప్పుల కోసం ఎప్పటికప్పుడు రాష్ట్రం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.

Share this on your social network: