కొండమీద హోటళ్ల నిషేధం

Published: Sunday February 20, 2022

రెండు మూడేళ్లుగా టీటీడీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. తాజాగా తిరుమల కొండమీద ప్రయివేటు హోటల్‌ అన్నదే లేకుండా చేస్తామని చేసిన ప్రకటన విస్తుపోయేలా చేస్తోంది. రోజుకి 80 వేలమంది(కొవిడ్‌కి ముందు) సందర్శించే భక్తక్షేత్రంలో ఇటువంటి నిర్ణయం అమలు చేయడం సాధ్యమయ్యేదేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇది భక్తులకు సౌకర్యమా, అసౌకర్యమా అనే చర్చ జరుగుతోంది. ప్రకటించేశాం కదా  ‘తగ్గేదే ల్యా’ అంటూ  మొండిగా అమలు చేయకుండా జనాభిప్రాయం తీసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. 

 

తిరుమల కొండకు ప్రస్తుతం రోజుకు 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తున్నారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో టీటీడీ కూడా అన్నిరకాల  దర్శనాలనూ అనుమతిస్తోంది కనుక ఈ సంఖ్య త్వరలోనే రెట్టింపు అవుతుంది. అంటే ఆహార అవసరాలు పెరుగుతాయి. ఈ దశలో హోటళ్లు లేకుండా భక్తుల కడుపు నింపడం టీటీడీకి సాధ్యం అవుతుందా అన్నదే సందేహం.  అన్నదానం ద్వారా రోజూ 60వేల విస్తళ్లు లేస్తున్నాయి.  లక్షమంది కొండకు వచ్చే రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాకా ఉంటోంది. తిరుమల కొండకు వచ్చే భక్తులకు రోజుకు కనీసం రెండు పూటల భోజన అవసరాలు ఉంటాయని అనుకుంటే.. లక్షా అరవై వేల మందికి రోజూ భోజనం అందించగలగాలి. కనీసం 40 వేల మందికి ఉపాహార అవసరాలు తీర్చగలగాలి. టీటీడీకి ఇది విపరీతమైన భారంగా మారే అవకాశం ఉంది. అత్యాధునిక యంత్రపరికరాలు ఉపయోగిస్తున్నా రోజుకు 60 వేల మందికే భోజనం అందిస్తున్నారు. అంటే మిగిలిన లక్ష భోజనాలు ప్రయివేటు  హోటళ్ళ నుంచే భక్తులు పొందుతున్నారు. రెండు వంటశాలలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లక్షన్నర భోజనాలు అందించగల సామర్థ్యం టీటీడీకి ఉందన్నది అధికారుల వాదన.  మరి ఆర్ధిక భారం?  ప్రస్తుతం అన్నదానం కోసం ఏడాదికి రూ. వంద కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే అన్నదానం ట్రస్టులో రూ.1400కోట్లు డిపాజిట్లు ఉన్నాయి గనుక భక్తుల నుంచి మరిన్ని నిధులు సమకూర్చుకోవడం టీటీడీకి కష్టం కాకపోవచ్చు. తిరుమలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ వచ్చే భక్తుల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భోజనపదార్ధాల తయారీకి కూడా టీటీడీ సిద్ధపడితే యేటా రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌లో అన్నదానంకి కేటాయించాల్సిరావచ్చు. కోవిడ్‌ తో టీటీడీ ఆదాయం తగ్గిపోయిందంటూ చెబుతున్న టీటీడీ ఇప్పుడు ఇంత భారం మోయడం అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. 

 

తిరుమలలో ప్రస్తుతం ఉన్న హోటళ్లు

త్రీ స్టార్‌ కేటగిరీ హోటల్‌: ఒకటి 

మధ్య స్థాయి హోటళ్ళు: 8 

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు: 150 

 

ఇవి గాక టిఫిన్‌లు నెత్తిన పెట్టుకుని కాటేజిల వద్దకు తెచ్చి అమ్మేవారు పాతిక ముప్పయి మంది ఉంటారు. హోట

హోటళ్ళ ద్వారా టీటీడీకి ఏటా వస్తున్న ఆదాయం: రూ. 20-25 కోట్లు

 హోటళ్ళలో పనిచేస్తున్న వారి సంఖ్య: 2 వేలు

 

తిరుమల హోటళ్ల నిర్వహణ మీద తరచూ విమర్శలు వస్తుంటాయి. టీటీడీ నిర్ణయించిన ధరలకు ఏ హోట్‌లోనూ పదార్ధాలు లభించవు. వీటి నాణ్యత మీద కూడా ఆరోపణలు వస్తుంటాయి. ఎందుకు ప్రధాన కారణం- అత్యంత తక్కువ ధరలకు ఆహార పదార్ధాలు సరఫరా చేయాలనే టీటీడీ నిబంధనకు తలవొగ్గి అత్యంత పెద్ద మొత్తం చెల్లించడానికి సిద్ధపడేవారికి మాత్రమే హోటళ్లు దక్కడం. నిజానికి ఆ రేట్లకు విక్రయిస్తే టీటీడీకి ఇంత మొత్తం చెల్లించడం అసాధ్యం. ఉదాహరణకు ఒక హోటల్‌ టీటీడీకి నెలకు 50 లక్షలు చెల్లించాలి. మరొక హోటల్‌ 40 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. జనతా హోటళ్లు కూడా నెలకు 3.5 లక్షల నుంచి 6 లక్షల దాకా టీటీడీకి చెల్లిస్తున్నాయి. ఇంతేసి మొత్తాలు కడుతున్న హోటళ్లు  టీటీడీ నిర్ణయించిన రేట్లకు ఆహారపదార్ధాలు విక్రయించడం అసాధ్యం. దీంతో విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. ఉదాహరణకు ఒక రెస్టారెంట్‌లో భోజనం 450 దాకా ఉంది. జనతా హోటళ్లలోనూ 75 నుంచి 150 దాకా భోజనం ధర ఉంటోంది. పైగా నాణ్యత తగ్గిస్తున్నారు. భారీ అద్దెలు వసూలు చేస్తున్న టీటీడీ, హోటళ్లలోని ఆహార పదార్ధాల ధరలు, నాణ్యత మీద పెద్దగా శ్రద్ధపెట్టడం లేదు. దాదాపుగా వాటి మీద నియంత్రణ ఉండదు. 

 

అందరికీ ఒక్కటే భోజనమా?

 

తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అందరూ అన్నదానంలో భోజనం చేయరు. ఒకవేళ చేసినా ఒక్క పవిత్రంగా భావించి ఒక్కపూట మాత్రమే తింటారు. తిరుమల కొండమీద బసచేసే మిగిలిన అన్నిపూటలా ప్రయివేటు హోటళ్లలోనే భోజనం చేస్తారు. ఇందుకు ప్రధాన కారణం భిన్న ఆహారపు అలవాట్లు. దేశంలో ప్రాంతాల వారీగా ఆహారపు అలవాట్లు మారుతాయి. అందరినీ సంతృప్తి పరచడం టీటీడీకి సాధ్యం కాదు. ఉత్తారాది భక్తులకు అన్నదానంలో రోటీ పెట్టాలనే ప్రయత్నంలోనే చతికిలపడ్డారు.  2012లో మొదలు పెట్టిన రోటీలు 2019లో మూతబడ్డాయి. యువత, పిల్లలు టీటీడీ పెడుతున్న భోజనంతో సంతృప్తి పడే అవకాశం లేదు. ఫ్రైడ్‌ రైస్‌లు, మంచూరియాలు ఇష్టపడే తరం.. పచ్చడి, సాంబారు, పొంగలితో అన్ని పూటలా సర్దుకుంటుందని అనుకోలేం. అలాగని ఈ పదార్ధాలన్నీ టీటీడీ వండి వడ్డించడం సాధ్యం కాదు. ప్రస్తుతం చిన్న చిన్న ఫస్ట్‌ఫుడ్‌ సెంటర్లలోనూ ఇవన్నీ దొరుకుతున్నాయి. పైగా రాత్రి యే సమయంలో దర్శనం చేసుకుని వచ్చినా ఆహారం దొరుకుతుంది. అన్నదాన కేంద్రాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. సంపన్న వర్గాలు అన్నిపూటలా అన్నదానంతో సరిపెట్టుకునే అవకాశమే ఉండదు.  ‘‘వీఐపీలు, బోర్డుసభ్యులు, చైర్మన్‌, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా ఎవరికైనా స్వామివారి కిచెన్‌ నుంచి వచ్చే ఆహారాన్నే పెడతాం.’’ అని టీటీడీ చైర్మన్‌ ప్రకటించినా వీరంతా అన్ని పూటలా ఇదే తింటారా అన్నదే సందేహం.