ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనం.

ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను మట్టికరిపించాడు. ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో కార్ల్‌సెన్‌ను ఓడించడం ద్వారా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు (సోమవారం) జరిగిన టర్రాష్ వేరియేషన్ గేమ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే మాగ్నస్‌ను ఇంటికి పంపాడు.
భారత యువ గ్రాండ్ మాస్టర్ అయిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద 8 పాయింట్లతో 8 రౌండ్ల తర్వాత 12వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు అనీష్ గిరి, క్వాంగ్ లీమ్ లేతో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ఎరిక్ హాన్సెన్, డింగ్ లిరెన్, జాన్-క్రిజ్‌స్టోఫ్ డుడా, షాఖ్రియార్ మామెద్యరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
కొన్ని నెలల క్రితం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కార్ల్‌సెన్ చేతిలో ఓటమి పాలైన రష్యన్ ఆటగాడు ఇయాన్ నెపోమ్నియాచి 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. డింగ్ లిరెన్, హాన్సెన్ ఇద్దరూ చెరో 15 పాయింట్లతో ఉన్నారు. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీలో ప్రిలిమినరీ రౌండ్‌లో ఒక విజయానికి మూడు పాయింట్లు లభిస్తాయి. డ్రా అయితే కనుక ఒక పాయింట్ వస్తుంది.

Share this on your social network: