బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు

Published: Tuesday February 22, 2022

 కర్ణాటకలోని శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో దర్యాప్తు వివరాలను ఆ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మంగళవారం వెల్లడించారు. ఈ కేసులో సుమారు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశారని, మిగిలినవారికి కూడా ఈ నేరంతో సంబంధం ఉన్నట్లు నిర్థరణ అయితే, వారిని కూడా అరెస్టు చేస్తారని తెలిపారు. 

జ్ఞానేంద్ర విలేకర్లతో మాట్లాడుతూ, హర్ష హత్య కేసులో పోలీసులు సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని, వీరిలో ముగ్గుర్ని అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. హిజాబ్ వివాదం, మత సంస్థల పాత్ర, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాహనాన్ని ఎవరు సమకూర్చారు? వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. 

 

ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదని అన్నారు. పోలీసులు తమ విధులను నిర్వహించారని చెప్పారు. ప్రశాంతతకు విఘాతం కలిగించేందుకు ఎటువంటి అవకాశాన్నీ ఇవ్వవద్దని కోరారు. నేరగాళ్ళను ప్రభుత్వం కచ్చితంగా అరెస్టు చేస్తుందని, తగిన శిక్ష పడే విధంగా చేస్తుందని చెప్పారు. హర్ష హత్యతోనే ఇటువంటి హత్యలకు ఫుల్ స్టాప్ పడాలన్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ దీని కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుకు తార్కిక ముగింపు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని చెప్పారు. ఉన్నతాధికారులు శివమొగ్గకు వచ్చారని, దర్యాప్తు బృందానికి ప్రత్యేక మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు. రాళ్లు విసిరినవారిపై కూడా కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతామని, తగిన విధంగా శిక్షిస్తామని చెప్పారు.

కారులో వచ్చిన కొందరు దుండగులు ఆదివారం హర్షపై దాడి చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. శివమొగ్గ పట్టణంలోని భారతి నగర్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో ఖాసిఫ్ (30), సయ్యద్ నదీం (20)లను అరెస్టు చేశారు. వీరిద్దరూ శివమొగ్గకు చెందినవారే. 

ఇదిలావుండగా, శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఆర్ సెల్వమణి తెలిపిన వివరాల ప్రకారం, ఈ జిల్లాలో కర్ఫ్యూను పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ అవసరాల కోసం బయటికి రావచ్చు. సెక్షన్ 144 ప్రకారం ఆంక్షలను  మరో రెండు రోజులు అంటే శుక్రవారం ఉదయం వరకు పొడిగించారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న రోజుల్లో పాఠశాలలను మూసివేస్తారు.