ఉదయగిరిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు.. సీఎం జగన్‌ రాక

Published: Wednesday February 23, 2022

సౌమ్యుడు, వివాద రహితుడు, అందరివాడిగా పేరు తెచ్చుకున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న సంగతి తెలిసి సింహపురి కన్నీరు పెట్టింది. ఆయనను కడసారి చూసేందుకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు, నేతలు, అధికారులు పెద్దఎత్తున మేకపాటి నివాసానికి తరలివచ్చారు. ‘గౌతమ్‌ అన్న.. అమర్‌రహే..’ అంటూ నినాదాలు చేశారు. విషణ్నవదనాలతో నివాళులర్పించారు. గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూసిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో మంగళవారం నెల్లూరుకు తీసుకొచ్చారు. ఉదయం 8.30గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 47లోని స్వగృహం నుంచి ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్మీ హెలికాప్టర్‌లో భౌతికకాయాన్ని నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ మైదానానికి తరలించారు.

 

అక్కడి నుంచి నగరంలోని మేకపాటి నివాసానికి రోడ్డు మార్గాన తీసుకొచ్చారు. గౌతమ్‌రెడ్డి తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అదిమూలపు సురేశ్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లోనే నెల్లూరు చేరుకోగా.. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి సోదరులు, మిగతా కుటుంబ సభ్యులు మరో ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ చక్రధర్‌బాబు.. గౌతమ్‌రెడ్డి భౌతిక కాయంపై జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. కుమారుడి భౌతికకాయాన్ని చూసిన తల్లి మణిమంజరి గుండె పగిలేలా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రజలకు సందర్శన కల్పించారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, గుమ్మనూరు జయరాం, శ్రీరంగనాథరాజు, సీఎస్‌ సమీర్‌శర్మ, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, తెలుగు-సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, గల్లా జయదేవ్‌, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సలహాదారు అజేయ కల్లంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.