ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి దుర్మరణం

Published: Tuesday March 01, 2022

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పశ్చిమ ఉక్రెయిన్‌కు చెందిన ఖార్కివ్ నగరంపై మంగళవారం ఉదయం రష్యా ప్రయోగించిన బాంబు దాడుల్లో శేఖరప్ప నవీన్ (21) అనే భారతీయ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కర్ణాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఈ విషయంపై సానుభూతి తెలుపుతున్నామని బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు భారతీయ విద్యార్థులు కీవ్ నగరాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. బాంబు దాడులతో వణికిపోతున్న ఖార్కివ్ నగరంలో ఇంకా భారీ సంఖ్యలోనే భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.