అమెజాన్‌-ఫ్యూచర్‌ వివాదంపై సుప్రీంకోర్టు

Published: Friday March 04, 2022

అమెజాన్‌-ఫ్యూచర్‌ రిటైల్‌ వివాదానికి త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. నేరుగా చర్చించుకోవడం ద్వారా 12 రోజుల్లో ఈ వివాదం సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు రెండు సంస్థలకు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సూచనలు చేసింది. లేకపోతే తామే ఈ కేసు తేల్చాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు పక్షాలు న్యాయస్థానం సూచనకు అంగీకరించాయి. 

రెండు పక్షాలు చర్చలకు అంగీకరించడంతో ఈ కేసు విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. సమస్య పరిష్కారం కోసం అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య చర్చలు నడుస్తున్నా దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు, ఎన్‌సీఎల్‌టీలో నడుస్తున్న కేసుల విచారణ యథావిధిగా కొనసాగుతుంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ తరఫున వాదించిన సీనియర్‌ లాయర్‌ హరీశ్‌ సాల్వే ఈ విష యం ప్రకటించారు.