‘రాధేశ్యామ్’ మిక్స్డ్ టాక్ .. అభిమాని ఆత్మహత్య

Published: Sunday March 13, 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ.. మిక్స్డ్ టాక్ రావడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన్పటికీ.. అంచనాల్ని అందుకోవడంలో  విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్ ఒక అభిమాని ప్రాణాలు తీసుకొనే వరకూ వెళ్ళింది. సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రభాస్ వీరాభిమాని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. 

కర్నూల్‌లో రవితేజ అనే ఓ వెల్డింగ్ కార్మికుడు ప్రభాస్ కు వీరాభిమాని. ప్రభాస్ ప్రతీ సినిమాను రిలీజ్ రోజునే చూడడం ఇతడికి బాగా ఇష్టం. తల్లి దినసరి కూలి. ఆ ఇద్దరే కుటుంబానికి జీవనాధారం. ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల కోసం ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రవితేజ విడుదల రోజునే సినిమా చూశాడు. సినిమాకి మిశ్రమ ఫలితం రావడంతో తన స్నేహితులతోనూ, తల్లితోనూ ఈ సంగతి చెప్పి చాలా బాధపడ్డాడట. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరిపోసుకొని రవితేజ  ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ వార్త తెలిసిన రవితేజ స్నేహితులు, ప్రభాస్ అభిమానులు, ఇంకా పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.