పెట్రోల్, డీజిల్ కంటే చౌకగా ఉండే ఫ్లెక్స్ ఇంధనం

Published: Sunday March 13, 2022

ప్రభుత్వం ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతూనే మరోవైపు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై దృష్టి సారిస్తోంది. ఫ్లెక్స్ ఇంధన వాహనాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తామని ఆటో మొబైల్‌ కంపెనీల ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను ఉపయోగించే అతిపెద్ద దేశం బ్రెజిల్. భారత్‌లో దీని తయారీ ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్లెక్స్ ఇంధనాన్ని ఉపయోగించడానికి, ఫ్లెక్స్ ఇంజిన్‌తో నడిచే వాహనాలను మార్కెట్లో లాంచ్ చేయాలి. ఇటువంటి వాహనాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తయారవుతున్నాయి.

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల మధ్య ఫ్లెక్స్ ఇంధనం అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి? అది వాహనాలను ఎలా నడుపుతుంది? మిగిలిన ఇంధనాలతో పోలిస్తే ఇది ఎంత చౌకగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లెక్స్ ఇంధనం పెట్రోల్-డీజిల్‌కు ప్రత్యామ్నాయం. ఇది గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్ మిశ్రమం నుండి తయారు చేస్తారు. Flex అనేది flexible అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. ఫ్లెక్స్ ఇంజన్లు ఫ్లెక్స్ ఇంధనంతో పని చేస్తాయి. ఫ్లెక్స్ ఇంజన్ అంటే ఎలాంటి సమస్య లేకుండా ఇతర ఇంధనాలతో కూడా నడుస్తుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలకు సంబంధించి భారతదేశంలో డిటైల్ ప్లానింగ్ జరుగుతోంది. ఇథనాల్, మిథనాల్ కలపడం ద్వారా ఫ్లెక్స్ ఇంధనాన్ని తయారు చేయవచ్చు. ఈ ఇంజన్ రాకతో వాహనాలు పూర్తిగా పెట్రోల్ లేదా డీజిల్ లేదా ఇథనాల్‌తో నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఇథనాల్.. మిథనాల్ ఒక రకమైన బయో-ఉత్పత్తి. వీటిని చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేస్తారు. దాని తయారీకి తక్కువ ఖర్చు అవుతుంది. ఫలితంగా దాని ధర కూడా తక్కువగానే ఉంటుంది. మన దేశంలో కాలుష్యం పెద్ద సమస్య. వాహనాల నుంచి వెలువడుతున్న వాయువులే ఇందుకు ప్రధాన కారణం. పెట్రోలియం ఇంధనాలు.. పర్యావరణానికి మంచివి కావు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంధనాలపై దృష్టి పెడితే, అది కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇథనాల్, మిథనాల్ వంటి ఇంధనాలు పర్యావరణానికి చాలా తక్కువ హానిని కలిగిస్తాయి. భారతదేశం 80 శాతం  మేరకు పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ఆధారపడి ఉంది. ఫ్లెక్స్ ఇంధనం రాకతో ఇలా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన దేశంలో చెరకు, మొక్కజొన్న మంచి ఉత్పత్తి రేటు ఉన్నందున మన దేశంలో ఇథనాల్ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.