జే బ్రాండ్లపై సమర భేరి

Published: Sunday March 20, 2022

జే బ్రాండ్స్‌ పోవాలి... జగన్‌ దిగిపోవాలి’ నినాదంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పాయి. సారా నిర్మూలన, మద్యం దుకాణాల్లో జే బ్రాండ్స్‌ నిషేధం, నాటుసారా మరణాలపై న్యాయ విచారణకు డిమాండ్‌ చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, ఏలూరుల్లో సారాకాటుకు 46 మంది బలైపోయిన నేపథ్యంలో.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపుమేరకు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. సుమారు 30వేలమంది కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలు చేశారు. కొత్తగా జే బ్రాండ్లతో ఏడాదికి రూ.6వేల కోట్ల లెక్కన ఐదేళ్లలో రూ. 30వేల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మద్యనిషేధం అని చెప్పి జగన్‌ సొంత బ్రాండ్ల మద్యం, కల్తీ సారా ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.

 

అధికారంలోకి వస్తే మద్యనిషేధం చేస్తానని చెప్పి ఇప్పుడు కల్తీ సారా, నాణ్యత లేని సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఇచ్చాపురంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పాలకొండలో నిమ్మక జయకృష్ణ, ఎచ్చెర్లలో కిమిడి రామ్‌ మల్లిక్‌నాయుడు, రాజాం నియోజకవర్గంలో జరిగిన ఆందోళనల్లో మాజీ మంత్రి కొండ్రు మురళి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులను అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో జే ట్యాక్స్‌తో జనాన్ని లూఠీ చేస్తున్నారని రాజమహేంద్రవరంలో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. పెద్దాపురంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో నిరసన లు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో బ్రాందీ షాపుల వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. తాళిబొట్లతో నిరసన వ్యక్తంచేస్తూ నాసిరకం మద్యం బ్రాండ్ల సీసాలు పగలగొట్టారు. భీమవరంలో తోట సీతారామలక్ష్మి, ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌, ఏలూరులో బడేటి రాధాకృష్ణయ్య ఆందోళనలు చేపట్టారు.

 

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో వైన్‌షాపుల దగ్గర ఆందోళన నిర్వహించారు. నెట్టెం రఘురాం, శ్రీరాం రాజగోపాల్‌, బచ్చుల అర్జునుడు, తంగిరాల సౌమ్య, దేవినేని ఉమ, బొండా ఉమ తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా వినుకొండలో జీవీ ఆంజనేయులు, సత్తెనపల్లిలో మన్నె శివనాగమల్లేశ్వర్‌రావు, కోడెల శివరాం, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆందోళనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఇంటూరు నాగేశ్వర్‌రావు, యడం బాలాజీ ఆందోళనలు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మ,  పత్తికొండలో కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎస్‌ఈబీ అధికారులకు సారా నివారణపై వినతిపత్రం ఇచ్చారు. కడప జిల్లాలో అమీర్‌బాబు, పుట్టా సుధాకర్‌, మల్లెల లింగారెడ్డి, అనంతపురం జిల్లాలో కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. బుక్కపట్నంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, గుత్తిలో వెంకటశివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.

 

అనంతపురంలో మద్యం షాపు ఎదుట పార్టీ నగర అధ్యక్షుడు మారుతీకుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతపురంలో చంద్రదండు వ్యవస్థాపకులు ప్రకా్‌షనాయుడును అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలో పులవర్తి నాని, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఆర్‌.శ్రీనివా్‌సరెడ్డి, భానుప్రకాష్‌ ఆందోళనలు నిర్వహించారు. విశాఖ గాజువాకలో జరిగిన ఆందోళనలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి మద్యం వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నారు. కర్నూలులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు నిరసన తెలిపి... తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వరం్యలో ధర్నా చేశారు.