ఉక్రెయిన్‌ శరణార్థుల కోసం.. నోబెల్‌ గోల్డ్‌ మెడల్‌ వేలం

Published: Wednesday March 23, 2022

దిమిత్రి మురటోవ్‌..! ఆయనో రష్యన్‌ జర్నలిస్టు. విపక్ష పాత్ర పోషించే దిగ్గజ రష్యన్‌ దినపత్రిక ‘నోవయా గెజెటా’కు ఎడిటర్‌. గత ఏడాది ఫిలిప్పైన్స్‌కు చెందిన మారియా రెసాతో కలిసి సంయుక్తంగా నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. ముందు నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ వచ్చిన మురటోవ్‌.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

35 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లిన నేపథ్యంలో.. వారి కోసం తన నోబెల్‌ గోల్డ్‌ మెడల్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. తన నోబెల్‌ను వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని శరణార్థులకు సదుపాయాలు కల్పించడానికి వినియోగిస్తానని వెల్లడించారు. రష్యా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అధికార పత్రికలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, వేలం ఈవెంట్‌ను తమ పత్రికలో ప్రచురించలేకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.