పూర్తిగా పక్షవాతానికి గురైన వ్యక్తితో మాట్లాడిస్తున్న శాస్త్రవేత్తలు!

జర్మనీ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. పూర్తిగా పక్షవాతానికి గురై మాటలు కోల్పోయిన వ్యక్తితో తిరిగి మాట్లాడించగలిగారు. మెదడులో చిన్నపాటి కంప్యూట్ ఇంటర్‌ఫేస్‌ను అమర్చడం ద్వారా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించగలిగారు. జర్మనీలోని టుబింజెన్ యూనివర్సిటీ సహకారంతో వైస్ సెంటర్ ఫర్ బయో అండ్ న్యూరో ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల బృందం ఈ ఘనత సాధించింది. వైద్యానికి సాంకేతికతను జోడించడం ద్వారా ఈ నమ్మశక్యం కాని అద్భుతాన్ని చేసి చూపించింది.
అమిట్రోఫిక్ లేటరల్ స్ల్కెరోసిస్ (ఏఎల్ఎస్) అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిపై రెండేళ్లుగా జరుగుతున్న అధ్యయనం తర్వాత పూర్తిగా పక్షవాతానికి గురైన వ్యక్తిలోనూ కమ్యూనికేషన్ సాధ్యమేనని నిరూపించారు. ఏఎల్ఎస్ అనేది నాడీ వ్యవస్థలోని కణజాలాలను విచ్ఛిన్నం చేసే వ్యాధి. దీనినే న్యూరోడీజెనరేటివ్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి గురైన వారు కదల్లేరు, మాట్లాడలేరు.
ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. అందులో పేర్కొన్న వివరాలను బట్టి పూర్తిగా లాక్ ఇన్ స్థితిలోనూ మెదడు ఆధారిత వొలిషనల్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని ఈ కేస్ స్టడీ నిరూపించింది.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తి వయసు 30 ఏళ్లని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అతడిలో అనుబంధ, ప్రైమరీ మోటరు కార్టెక్స్‌లో 64 మైక్రోఎలక్ట్రోడ్ శ్రేణులను అమర్చారు. ఇవి మెదడు సంకేతాలను గ్రహించి రోగి ఏమి చెప్పాలనుకుంటున్నాడో గుర్తిస్తాయి. అనంతరం స్పెల్లర్ ప్రోగ్రాం.. వర్ణమాలలోని అక్షరాలను బిగ్గరగా వినిపించడం ద్వారా రోగి భావాలను వెల్లడిస్తుంది.
ఏఎల్‌ఎస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. 2040 నాటికి ఇది 3 లక్షలమందికిపైగా సంక్రమిస్తుందని అంచనా. వీరిలో చాలామంది మాట్లాడలేని స్థితికి చేరుకుంటారు. కుటుంబం లేదంటే సంరక్షకుల సహకారంతో ఈ వ్యవస్థను సూత్రప్రాయంగా ఇంట్లోనూ ఉపయోగించవచ్చని అధ్యయనం పేర్కొంది.

Share this on your social network: