శ్రీలంకలో తగ్గనున్న ఉత్పత్తి... పెరగనున్న టీ ధరలు

Published: Saturday April 16, 2022

శ్రీలంక ఆర్థిక సంక్షోభం... అంతర్జాతీయ స్థాయిలో తేయాకు వ్యాపారం, వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టీ ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తేయాకు ఎగుమతుల్లో శ్రీలంక ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే తాజా సంక్షోభం కారణంగా శ్రీలంకలో వ్యవసాయానికి 12 నుంచి 14 గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో అక్కడ తేయాకు ఉత్పత్తి 15 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని భారత తేయాకు ఎగుమతిదారుల సంఘం పేర్కొంది. ఈ పరిణామాలతో తేయాకు ఎగుమతుల విషయంలో భారత్‌ లబ్ధి పొందనుంది. శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల కొరతను పూడ్చటానికి భారత్‌ సిద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలో భారత్‌కు కొన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా రష్యా, ఇరాన్‌లతో చెల్లింపుల సమస్య ఏర్పడింది. అంతేగాక ఐరోపా, అమెరికా మార్కెట్లలో మన తేయాకు అంతగా ప్రాచుర్యం పొందలేదు. వీటికితోడు... అంతర్జాతీయ రవాణా చార్జీలు భారతీయ ఎగుమతిదారులకు భారంగా మారాయి. ఈ అవరోధాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మేరకు తేయాకు ఎగుమతిదారులతో చర్చిస్తున్నామని భారత టీ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. తేయాకు ఎగుమతి వ్యాపారంలో ఉన్న ఓ కంపెనీ ప్రతినిధి ఈ అంశాలపై మాట్లాడుతూ... ‘‘తేయాకు కోసం కొన్ని దేశాలు సంప్రదిస్తున్నాయి. అయితే అమెరికా ఆంక్షల కారణంగా రష్యా, ఇరాన్‌ నుంచి చెల్లింపులు నిలిచిపోతాయేమోననే ఆందోళన ఉంది. దీంతో ఎగుమతుల విషయంలో దూకుడుగా వ్యవహరించలేకపోతున్నాం’’ అన్నారు. భారత్‌ నుంచి తేయాకును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇరాన్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా రష్యా, అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యూకే ఉన్నాయి. అలాగే... శ్రీలంక నుంచి అత్యధికంగా తేయాకును రష్యా, ఇరాక్‌, టర్కీ, ఇరాన్‌, చిలీ దిగుమతి చేసుకుంటున్నాయి. శ్రీలంకలో ఉత్పత్తి తగ్గితే ఆయా దేశాల్లో భారత్‌కు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు...  శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా టీ ధరలు పెరిగే అవకాశం ఉంది. శ్రీలంకలో సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి భారత్‌లోని టీ కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరగడాన్ని కూడా టీ ధరల పెరుగుదలకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.