మద్యంలో ‘కమీషన్ల కిక్కు’

Published: Tuesday April 19, 2022

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘కొత్త’ మద్యం పాలసీ వచ్చింది. ప్రైవేటు దుకాణాలు పోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చాయి. అప్పటివరకూ అందరికీ తెలిసిన పాపులర్‌ బ్రాండ్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఊరూపేరూ  తెలియని కొత్త బ్రాండ్లు వచ్చాయి. ‘అస్మదీయుల తయారీ’ మద్యం మాత్రమే అమ్మడం మొదలుపెట్టారు. పాపులర్‌ బ్రాండ్లు ఏవైనా సరే... ‘మాకు కమీషన్‌ ఇస్తేనే మీ మద్యం కొంటాం’ అని షరతులు పెట్టారు. పది నుంచి 20 శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో బిజినెస్‌ చేసే మేం మీకు కమీషన్లు ఇవ్వడం ఏమిటి’ అంటూ చాలా మద్యం కంపెనీలు రాష్ట్రంలో వ్యాపారం మానుకున్నాయి. పూర్తిగా మూసేయడం ఇష్టంలేని కొన్ని కంపెనీలు కప్పం కట్టి వారి బ్రాండ్లను మళ్లీ మార్కెట్లోకి తెచ్చాయి.

 

అది కూడా కేవలం రెండు మూడు బ్రాండ్లే.  ఎన్ని కేసులు అమ్మితే అన్నిటికీ కమీషన్‌ సమర్పించుకోవాల్సి రావడంతో... అంతకుముందుతో పోల్చితే 50 శాతం సరుకును మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఒకవైపు భారీ ధరలు... మరోవైపు అంతగా నాణ్యతలేని, కొత్తకొత్త బ్రాండ్లతో మందుబాబుల్లో సర్కారుపై వ్యతిరేకత పెరిగింది. మరోవైపు... ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జోరందుకుంది. ఈ నేపథ్యంలో... గత ఏడాది చివర్లో ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. అక్రమ రవాణా అరికట్టడంతోపాటు ఆదాయం పెంచుకునేందుకు వీలుగా... అన్ని బ్రాండ్లను షాపుల్లోకి తేవాలని భావించింది. సరఫరాకు సిద్ధం కావాలంటూ ఆయా బ్రాండ్ల యాజమాన్యాలకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి సమాచారం కూడా వెళ్లింది. ప్రభుత్వ ఆదాయం పెంచడమే లక్ష్యంగా కమీషన్లను కూడా ‘త్యాగం’ చేశారనేలా ప్రచారం జరిగింది. దీంతో దాదాపు రెండేళ్ల కిందట ఆగిపోయిన బ్రాండ్ల కంపెనీలు మళ్లీ ఏపీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ... అంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. కమీషన్‌ కడితేనే సరఫరా అంటూ మెలిక పెట్టడంతో... పాత, పాపులర్‌ బ్రాండ్లు ఆగిపోయాయి.

 

సందేహాలకు జవాబేదీ?

మద్యం అమ్మకాల్లో పారదర్శతను పాటిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతనే ఉండటంలేదు. ‘బ్రూవరీలన్నీ తెలుగుదేశం వాళ్లవే. మేం వచ్చాక కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వనేలేదు’ అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ... అధికారంలోకి రాగానే పాత, పాపులర్‌ బ్రాండ్లు ఎందుకు మాయమయ్యాయి? కేవలం... మూడు పాత బ్రాండ్లకు మాత్రమే ఎందుకు అనుమతిస్తున్నారు? కమీషన్ల వ్యవహారం లేకుంటే... మిగిలిన బ్రాండ్లు ఏపీకి ఎందుకు బైబై చెబుతాయి? ఆ మూడు బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఎందుకు వెళుతున్నాయి? ఈ ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పడంలేదు. జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒక బీర్‌ కంపెనీకి చెందిన బ్రూవరీ గత ఏడాది మూతపడింది. ఇప్పుడు... మళ్లీ అది తెరుచుకుంది. దీని వెనుక ఏం జరిగిందనేదీ ఓ మిస్టరీనే!

 

ఆగిపోయిన బ్రాండ్లు

ఇక తాజాగా లేబుళ్లు రెన్యువల్‌ చేసుకోకపోవడంతో కొన్ని బ్రాండ్ల మద్యం సరఫరా నిలిచిపోయింది. ప్రతి ఏటా ఈ సమయంలో బ్రాండ్ల లేబుళ్ల రెన్యువల్‌ ప్రక్రియ జరుగుతుందని, ఈసారి కొన్ని బ్రాండ్లు రెన్యువల్‌ చేసుకోలేదని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి తెలిపారు. ఆగిపోయిన బ్రాండ్లన్నీ ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.