ఆర్టీసీని ప్రయాణికులే ఆదుకోవాలి

Published: Sunday July 15, 2018
‘‘ప్రధాని నరేంద్ర మోదీ డీజిల్‌ ధరలు భారీగా పెంచారు. ఏపీఎ్‌సఆర్టీసీకి ఇది గుదిబండయ్యింది. బస్సు చార్జీలు పెంచుతామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అంటున్నారు’’ అని సంస్థ చైర్మన్‌ వర్ల రామయ్య అన్నారు. మూడు సంవత్సరాలకుగా ప్రయాణీకులపై రూపాయి భారం మోపలేదని గుర్తు చేశారు. కార్మికుల కష్టం, అధికారుల మార్గ నిర్దేశనంతో సంస్థ నష్టాలను భారీగా తగ్గించుకున్నామన్నారు. మోదీ పెంచిన డీజిల్‌ దెబ్బకు తిరిగి భారీ నష్టాల్లో కూరుకు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలతో సంబంధం లేకుండా సురక్షిత ప్రయాణ వసతిని కల్పించటమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆర్టీసీని ప్రజలే కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలపై భారం మోపకుండా ఇతర మార్గాలను అన్వేషించాలన్న సీఎం సూచనతో గుజరాత్‌లో పర్యటించి వచ్చిన ఆయన శనివారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో విలేకర్లతో మాట్లాడారు.
 
కేవలం టిక్కెట్లపై వచ్చే ఆదాయంతో సంస్థ మనుగడ సాగించలేని పరిస్థితి వచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం చార్జీలు పెంచిన నాటికీ ఇప్పటికీ డీజిల్‌ ధర లీటరుకు ఏడు రూపాయలు పెరిగిందన్నారు. 30కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్న ఆర్టీసీపై ఏటా రూ.210కోట్ల అదనపు భారం పడిందని వివరించారు. 2016-17లో రూ.745 కోట్ల నష్టం వచ్చిందన్నారు. à°ˆ భారాన్ని రూ.430 కోట్లకు తగ్గించగలిగినా డీజిల్‌ భారంతో అది రూ.640కోట్లకు చేరిందని వర్ల రామయ్య తెలిపారు. చార్జీల పెంపును ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించబోనని సీఎం స్పష్టం చేశారన్నారు. డీజిల్‌పై రాష్ట్రం విధిస్తోన్న రెండు రపాయల భారం తగ్గించమని, ఎంవీ టాక్స్‌ మినహాయించమని సీఎంను కోరామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. దీనికితోడు ఆర్టీసీ స్థలాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయటం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలని అనుకుంటున్నామన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలలో అమ్యూజిమెంట్‌ పార్కుల ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు.