కేంద్ర పథకాలు తనవిగా ప్రచారం

Published: Tuesday July 31, 2018
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్రం ధారాళంగా పలు పథకాలను అమలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. వాటిని రాష్ట్రప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ కేంద్రాన్ని విమర్శిస్తోందని ఆరోపించారు. సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సొమ్ము కేంద్రానిది, సోకు చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు 7.44 లక్షల ఇళ్లు ఇచ్చిందని, వాటిని టీడీపీ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తారు.
 
మరుగుదొడ్లు, గృహాలు, పింఛన్లు, అన్ని సంక్షేమ పథకాల్లో నిధులను స్వాహా చేసి రాష్ట్రప్రభుత్వం అవినీతి తాండవం చేస్తోందని దుయ్యబట్టారు. రైతుల భూములకు చుక్కలు పెట్టి వాటిని కూడా కబ్జా చేయాలని చూస్తోందన్నారు. 2014లో అడ్డమైన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2019లో ఇవ్వడానికి ఏ హామీ లేక జగన్‌ ట్రాప్‌లో పడి మళ్లీ ప్రత్యేక హోదా కావాలని, తన అనుకూల పత్రికల్లో కథనాలు రాయిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.